శంకరాచార్యులవారు శుద్ధ వైష్ణవుడు
ABN , Publish Date - Feb 09 , 2026 | 02:56 AM
జగద్గురు ఆదిశంకారాచార్యులవారు శుద్ధ వైష్ణవుడని.. దేశం నలుమూలలా ఉన్న చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదని చినజీయర్ స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ......
చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదు
పదమూడో శతాబ్దంలో విద్యారణ్యులవారు ఏర్పాటుచేశారు
శంకరాచార్యులవారికి పంచాయతనం తెలియదు
విదేశీయుల పాలన ఎదుర్కోవడానికి విద్యారణ్యులవారే మొదలుపెట్టారు
చినజీయర్ వివాదాస్పద వ్యాఖ్యలు
హైదరాబాద్, ఫిబ్రవరి 8: జగద్గురు ఆదిశంకారాచార్యులవారు శుద్ధ వైష్ణవుడని.. దేశం నలుమూలలా ఉన్న చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదని చినజీయర్ స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్‌లో ఉన్న సమతామూర్తి స్ఫూర్తికేంద్రంలో జరుగుతున్న ‘సమతాకుంభ్’ బ్రహ్మోత్సవాల్లో.. ఇటీవల ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘‘శంకారాచార్యులవారు నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు.. నాలుగు దిక్కుల్లోనూ. చతురామ్నాయ పీఠాలు’ అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే.. పూరీ జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి.. ఇలాగ నాలుగు మఠాలు.. వాటిని శంకరాచార్యులవారు ఏర్పాటు చేయలేదు. ఆయన 32 ఏళ్ల వయసులో ఉత్తర భారతానికి వెళ్లారు.. హిమాలయాల్లోకి వెళ్లి తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత ఆయనొచ్చి మళ్లీ మఠాల్ని ఏర్పాటుచేయడం అనేటటువంటిది.. దట్స్ నాట్ ద రైట్ స్టోరీ (సరైన కథ కాదు). ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహా సామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహరరాయలు, బుక్కరాయలకు గైడ్‌గా ఉండేవారు.. విద్యారణ్యస్వామి. వేదభాష్యాలను రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశికులవారి సహాధ్యాయి. ఆయన విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశాడు ఈ నాలుగు పీఠాల్నీ. పం చాయతనాన్ని ఇంట్రడ్యూస్ (పరిచయం) చేసింది కూడా ఆయనే. శంకరాచార్యులవారి కాలంలో పంచాయతనాన్ని ఆయన ఆరాధన చేయలేదు. ఆయన నారాయణ పరాయణుడు. ఆదిశంకరాచార్యులవారు అని చెప్పేటటువంటి మహనీయులు.. శుద్ధవైష్ణవుడాయన. తత్వం అద్వైత తత్వం. కానీ, ఆయన ఉత్తమ వైష్ణవుడు. ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలున్నాయి మనకి. భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి, ఉపనిషత్తులకి.. ఎందులో మనం చూసినా శుద్ధమైనటువంటి, స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లగుద్ది చెప్పినట్టుంటుంది. ఇంకా అక్కడక్కడా రామానుజులవారు కాస్త మొహమాటపడి ‘సర్వేశ్వరేశ్వరః’ అని వాడుతుంటారు. కానీ శంకరాచార్యులవారికట్లాంటి మొహమాటాలేమీ లేవు.
నారాయణః.. వాసుదేవః.. విష్ణుః.. స్పష్టంగా చెబుతారాయన వారి భాష్యాల్లో. విదేశీయులు మనదేశాన్ని ఆక్రమించడం ప్రారంభమైంది కనక అప్పటికి.. అలాంటివారిని ఎదుర్కోవడానికి అందరూ కలిసుంటే బాగుంటుంది అనే ఒక తాత్పర్యం చేత విద్యారణ్యులవారు అన్ని మార్గాల్లో ఉండేవాళ్లను.. శైవంలో ఉండేవాళ్లని, వైష్ణవంలో ఉండేవాళ్లని, శాక్తేయంలో ఉండేవాళ్లని, గాణాపత్యంలో ఉండేవాళ్లని అందరినీ కలిపి ఒకచోట పెడితే ఇది మనకి కాస్త రక్షణగా ఉంటుంది అని భావించి ఆయన పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేశారు’’ అని చినజీయర్ స్వామి చెప్పారు. 13వ శతాబ్దంలో విద్యారణ్యులవారు చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసినట్టు చినజీయర్ చెప్పారుగానీ.. నాలుగు పీఠాల్లో ఒకటైన శృంగేరి పీఠానికే విద్యారణ్యులవారు 12వ గురువు కావడం గమనా ర్హం. ఆయన 1380 నుంచి 1386 దాకా శృంగేరి పీఠాధిపతిగా ఉన్నారు. ఆయనకన్నా ముందు.. విద్యారణ్యులవారి సోదరుడు (తమ్ముడు) భారతీ తీర్థ.. 1333నుంచి 1380 దాకా 11వ పీఠాధిపతిగా ఉన్నారు. అలాంటిది.. చతురామ్నాయ పీఠాలను విద్యారణ్య స్వామి ఏర్పాటు చేయడమేమిటంటూ చినజీయర్ స్వామిపై భక్తులు విమర్శలు చేస్తున్నారు.