China Manja Strangles: మెడలు కొసేస్తున్న చైనా మాంజా
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:59 AM
సంకాంత్రి వేళ పతంగుల సరదా భయపెడుతోంది. పతంగులు ఎగురవేసేందుకు కొందరు వినియోగిస్తున్న నిషేధిత చైనా మాంజా..
మెట్‌పల్లిలో నాలుగేళ్ల బాలుడి మెడకు చుట్టుకున్న మాంజా
తీవ్ర గాయం.. 22 కుట్లు
హైదరాబాద్‌లో ఓ వ్యక్తి మెడకు చుట్టేసిన మాంజా.. తీవ్ర రక్తస్రావం
మెట్‌పల్లి టౌన్, హైదరాబాద్ సిటీ, అంబర్‌పేట, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): సంకాంత్రి వేళ పతంగుల సరదా భయపెడుతోంది. పతంగులు ఎగురవేసేందుకు కొందరు వినియోగిస్తున్న నిషేధిత చైనా మాంజా.. మెడకు చుట్టుకొని కొందరి ప్రాణాలమీదకు తెస్తోంది. ప్రమాదవసాత్తు చైనా మంజా మెడకు చుట్టుకొని ఓ నాలుగేళ్ల బాలుడు సహా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో జరిగిన ఘటనలో శ్రీహాస్ (4) అనే బాలుడు ప్రమాదానికి గురయ్యాడు. నిజామాబాద్‌కు చెందిన స్వప్న, శ్రీకాంత్ దంపతులకు శ్రీహాస్ అనే కుమారుడు ఉన్నాడు. సంక్రాంతి నేపథ్యంలో స్వప్న తన భర్త, కుమారుడిని తీసుకొని మెట్‌పల్లిలోని దుబ్బవాడలో ఉన్న తన పుట్టింటికి వచ్చింది. గురువారం సాయంత్రం శ్రీహాస్ ఇంటి బయట పిల్లలతో ఆడుకుంటుండగా గాల్లో ఎగురుతున్న పతంగి తెగి దానికున్న చైనా మాంజా అతడి మెడకు చుట్టుకుపోయింది. దీంతో శ్రీహాస్ మెడ కోసుకుపోయి తీవ్ర రక్తస్రావమైంది. శ్రీహా్‌సను తల్లిదండ్రులు వెంటనే మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలుడి మెడకు 22 కుట్లు పడ్డాయని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక, హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘటన రామంతాపూర్‌కు చెందిన వీరయ్య (48) అనే వ్యక్తి చైనామాంజా వల్ల గాయపడ్డాడు. ప్రైవేటు ఉద్యోగి అయిన వీరయ్య విధుల ముగించుకొని ఇంటికి తిరిగి వెళుతున్న క్రమంలో గోల్నాక నుంచి రామంతపూర్ వైపునకు వెళ్లే ఫ్లైఓవర్‌పై వెళ్లాడు. ఫ్లై ఓవర్ మధ్యలోకి రాగానే అనుకోకుండా గాలికి వచ్చిన చైనా మాంజా వీరయ్య మెడకు చుట్టుకుపోయింది. దీంతో గొంతు కింది భాగం కోసుకుపోయి తీవ్ర రక్త స్రావం అయ్యింది. వీరయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కాగా సీపీ సజ్జనార్ ఆదేశాల మేరకు చైనా మాంజా విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించిన సీపీఎస్ పోలీసులు శుక్రవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఐదుగురు చైనా మాంజా విక్రేతలను అరెస్ట్ చేశారు. వారి నుంచి 155 బాబీన్ల నిషేధిత చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.