Temperature Increases: తుర్రుమన్న చలి
ABN , Publish Date - Jan 15 , 2026 | 05:32 AM
సంక్రాంతికి చంకలు లేపలేనంతగా చలి ఉంటుందంటారు. అంతగా వణికించాల్సిన చలి శివరాత్రికి ముందే తుర్రుమంది. మొన్నటిదాకా.. ఇంట్లో ఉంటే దుప్పట్లో, బయటకొస్తే చలిమంటలు కాచుకునేంతగా వణికించిన చలి ఇప్పుడు లేదు.
రాష్ట్రంలో ప్రజలకు ఉపశమనం
సాధారణ స్థితికి వాతావరణం
2 రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతికి చంకలు లేపలేనంతగా చలి ఉంటుందంటారు. అంతగా వణికించాల్సిన చలి శివరాత్రికి ముందే తుర్రుమంది. మొన్నటిదాకా.. ఇంట్లో ఉంటే దుప్పట్లో, బయటకొస్తే చలిమంటలు కాచుకునేంతగా వణికించిన చలి ఇప్పుడు లేదు. కొన్నాళ్లుగా తీవ్ర చలిగాలులతో ఇబ్బందిపడ్డ ప్రజలకు మారిన వాతావరణ పరిస్థితులు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో గడిచిన నెల రోజులుగా హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా మంది చలికి భయపడి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్లల్లో కూడా చలి తీవ్రత బయటికంటే ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎముకలు కొరికే చలి, తీవ్రమైన చలిగాలులతో వృద్ధులు, చిన్నపిల్లలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే సంక్రాంతి పండగకు రెండు రోజుల ముందు నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. కొన్నాళ్లుగా ఫ్యాన్లు, ఏసీల జోలికి వెళ్లని ప్రజలు పగటి ఊష్ణోగ్రతలు పెరగడంతో తిరిగి వాటి వాడకం మొదలు పెట్టారు. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఫ్యాన్ లేనిదే ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. కాగా రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత తగ్గి, ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ వివరాల ప్రకారం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. గత కొన్ని రోజులుగా తీవ్ర చలిగాలు ఉండగా మూడు రోజుల నుంచి శీతలగాలుల పరిస్థితి తగ్గింది. వచ్చే వారం రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రానున్న 3-4 రోజుల్లో హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం రాష్ట్రంలో పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రానున్న వారం, పది రోజులు ఇదే వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వారం రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో బుధ, గురువారాల్లో వాతావరణ పరిస్థితుల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందన్నారు. కాగా గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న కోల్డ్‌వేవ్ 2.0 ముగిసిందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయిలోనే ఉంటాయని (25-26 డిగ్రీలు), రాత్రి ఉష్ణోగ్రతలు కొంచెం పెరుగుతాయన్నారు. సంక్రాంతి సమయంలో పగటి ఉష్ణోగ్రతలు 29-31 డిగ్రీ వరకు పెరుగుతాయని వెల్లడించారు. మొత్తంగా సీజనల్ చలి కొనసాగుతుందని వివరించారు. మరో వారం, పది రోజులపాటు గణనీయమైన చలి గాలులు వీచే అవకాశం లేదన్నారు. సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ముఖ్యంగా బీదర్ సరిహద్దు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ వెల్లడించారు.