Share News

సౌందర రాజన్‌ కన్నుమూత

ABN , Publish Date - Feb 28 , 2026 | 04:23 AM

ఆలయాల స్వయం ప్రతిపత్తి, హుండీ లేని ఆధ్యాత్మిక పాలన కోసం నిరాటకంగా కృషి చేసిన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు ఎం.వీ. సౌందర రాజన్‌(90) ఇక లేరు.

సౌందర రాజన్‌ కన్నుమూత

  • చిలుకూరు బాలాజీ ఆలయానికి ప్రధాన అర్చకుడిగా గుర్తింపు

  • గుళ్లపై ప్రభుత్వ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం

  • ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ రిజిస్ర్టార్‌గా సేవలు

  • వాయిస్‌ ఆఫ్‌ టెంపుల్స్‌ త్రిభాషా పత్రిక సంపాదక బాధ్యతలు

  • ఆధ్యాత్మిక చైతన్యాన్ని విస్తరింపచేశారన్న సీఎం రేవంత్‌ రెడ్డి

  • ఆలయాల స్వతంత్రతను కాపాడేందుకు కృషి చేశారన్న చంద్రబాబు

  • నేడు చిలుకూరులో అంత్యక్రియలు, ఉదయం 9గంటలకు అంతిమయాత్ర

మొయినాబాద్‌, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ఆలయాల స్వయం ప్రతిపత్తి, హుండీ లేని ఆధ్యాత్మిక పాలన కోసం నిరాటకంగా కృషి చేసిన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు ఎం.వీ. సౌందర రాజన్‌(90) ఇక లేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమైన ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. సౌందర రాజన్‌కు లక్ష్మీనరసింహన్‌, రంగరాజన్‌, మురళీధరన్‌ ముగ్గురు కుమారులు. ఆయన భార్య వసుమతి 2018లో మరణించారు. చిలుకూరు బాలాజీ ఆలయం వెనుక గోశాల పక్కన శనివారం దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సౌందర రాజన్‌ తనయుడు, ఆలయ ప్రస్తుత అర్చకుడు రంగరాజన్‌ వెల్లడించారు. ఉదయం 9 గంటలకు అంతిమ యాత్ర మొదలవుతుందని తెలిపారు.

భగవంతుని సన్నిధిలో అందరూ సమానమే

వెంకటరాఘవాచారి, కోమలమ్మ దంపతులకు 1938 జులై 4న సౌందర రాజన్‌ జన్మించారు. ఆయన బాల్య జీవితం చెన్నైలో గడిచింది. ఉస్మానియా యూనివర్సీటీలో పీహెచ్‌డీ పూర్తి చేసి అక్కడే ప్రొఫెసర్‌గా చేరారు. యూనివర్సిటీలో కీలక పదవులు నిర్వహించారు. చివరగా ఉస్మానియా యూనివర్సిటీలో రిజిస్ర్టార్‌గా పనిచేసి 1999లో రిటైరయ్యారు. రిటైర్‌మెంట్‌ తరువాత రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన బాలాజీ దేవాలయానికి అప్పట్లో అంతగా ప్రాచుర్యంలో లేదు. 2000 సంవత్సరం నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సౌందర రాజన్‌ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. భగవంతుని సన్నిధిలో అందరూ సమానమేనని, టికెట్లు, హుండీ కానుకలు లేకుండా అందరు ఒకే వరుసలో వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాలన్నారు. ఆలయంలో హుండీ తీసేశారు. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దేవాదాయ శాఖలో కలిపేందుకు అప్పటి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేసింది. సౌందర రాజన్‌ ప్రభుత్వంతో పోరాటం చేసి దేవాదాయ శాఖలోకి వెళ్లకుండా అడ్డుకుని స్వయం ప్రతిపత్తి దేవాలయంగా కొనసాగిస్తూ వచ్చారు. గుళ్లపై ప్రభుత్వ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు.


ప్రముఖుల నివాళి

సౌందర రాజన్‌ మరణంపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకుడిగా, రిజిస్ట్రార్‌గా మంచి పేరు గడించిన సౌందర రాజన్‌ అధ్యాత్మిక చైత్యనం విస్తరింప జేయడంలో కీలక పాత్ర పోషించారని ఎక్స్‌ వేదికగా కొనియాడారు. సౌందర్‌రాజన్‌ మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం దేవస్థానానికి, భక్తులకు తీరని లోటన్నారు. ఆలయాల సంప్రదాయాలను, స్వతంత్రతను కాపాడేందుకు సౌందర రాజన్‌ జీవితాంతం కృషి చేశారని చంద్రబాబు చెప్పారు. సౌందర రాజన్‌ భౌతికకాయానికి చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మహేశ్వరం, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు నివాళులర్పించారు.

Updated Date - Feb 28 , 2026 | 04:24 AM