వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి
ABN , Publish Date - Apr 16 , 2026 | 04:20 AM
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న తొమ్మిదేళ్ల బాలుడు బుధవారం కన్నుమూశాడు.
పక్షం రోజుల పోరాటం తర్వాత కన్నుమూత
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఘటన
తంగళ్లపల్లి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న తొమ్మిదేళ్ల బాలుడు బుధవారం కన్నుమూశాడు. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మహేశ్-సంగీత దంపతుల కుమారుడు ఆదిత్య, 15 రోజుల క్రితం ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు అతడిపై విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో కుక్కలు బాలుడి కాళ్లను విచక్షణారహితంగా కరిచాయి. తప్పించుకునే క్రమంలో ఆదిత్య కింద పడడంతో తలకు బలమైన గాయమైంది. పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. తలలో రక్తం గడ్డకట్టడంతో బాలుడు కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. మహేశ్-సంగీత దంపతులు తమ కుమారుడిని కాపాడుకునేందుకు సుమారు రూ.10లక్షల వరకు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిది. బుధవారం పరిస్థితి మరింత విషమించడంతో ఆదిత్య మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.