సమ్మక్కసాగర్ ముంపు సర్వేకు నిధులివ్వండి
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:14 AM
సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం) బ్యారేజీ నిర్మాణం వల్ల, నీటిని నిల్వచేయడం, ఫలితంగా బ్యాక్ వాటర్ ముంపుపై సర్వే చేయడానికి అయిన వ్యయం కింద రూ.9.88 కోట్లను సమకూర్చాలని ఛత్తీ్‌సగఢ్ కోరింది.
తెలంగాణను కోరిన ఛత్తీ్‌సగఢ్
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం) బ్యారేజీ నిర్మాణం వల్ల, నీటిని నిల్వచేయడం, ఫలితంగా బ్యాక్ వాటర్ ముంపుపై సర్వే చేయడానికి అయిన వ్యయం కింద రూ.9.88 కోట్లను సమకూర్చాలని ఛత్తీ్‌సగఢ్ కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జాకు ఆ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి రాజేశ్ సుకుమార్ లేఖ రాశారు. గోదావరిపై ములుగు జిల్లాలో కడుతున్న సమ్మక్కసాగర్ బ్యారేజీ క్లియరెన్స్ రావాలంటే ఛత్తీస్‌గఢ్ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తీసుకోవడం ముఖ్యం. ఆ రాష్ట్రం సమ్మక్కసాగర్ బ్యారేజీతో కలిగే ముప్పు ఐఐటీ ఖరగ్‌పూర్‌తో ఇప్పటికే అధ్యయనం చేయించింది. బ్యారేజీ వద్ద 87 మీటర్ల గరిష్ఠ వరదతో ఛత్తీ్‌సగఢ్ బీజాపూర్ జిల్లాలోని పోటూరు, కౌటూరు, తుర్లగూడ, గంగారం, కంబాలపేట, సీతానగరంలో 500ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని సర్వేలో తేలింది. ఇక సమ్మక్కసాగర్‌కు కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ)లోని అన్ని డైరెక్టరేట్లు క్లియరెన్స్ ఇవ్వగా... అంతరాష్ట్ర విభాగం ఒక్కటే ఛత్తీ్‌సగఢ్ వల్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. క్లియరెన్స్ ఇవ్వాలంటే ఛత్తీ్‌సగఢ్ నుంచి ఎన్‌వోసీ తెచ్చుకోవాలని ఇదివరకే పలు దఫాలుగా తేల్చిచెప్పింది. బ్యారేజీ పూర్తిస్థాయి నీటినిల్వ 83 మీటర్లు కాగా... అక్కడిదాకా ముంపునకు గురయ్యే భూములకే పరిహారం చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే పలుమార్లు తేల్చిచెప్పిన విషయం విదితమే. అయితే గరిష్ఠ వరద 2022 జూలై 17, 19వ తేదీల్లో 88 మీటర్ల దాకా రికార్డయిందని ... ఆ మేరకు ముంపునకుగురయ్యే భూములకు పరిహారం చెల్లించాల్సిందేనని ఛత్తీ్‌సగఢ్ పట్టుబడుతూనే ఉంది. తాజాగా ఐఐటీ-ఖరగ్‌పూర్‌తో అధ్యయనం చేయించగా... స్పష్టత వచ్చింది.