బొగ్గు గని తవ్వి.. రిజర్వాయర్‌గా మార్చి!
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:42 AM
ఏదైనా ఒక ప్రాంతంలో మైనింగ్ పూర్తైతే ఆ ప్రాంతాన్ని తిరిగి జనావాసాలకు అనుకూలంగా లేదా పర్యావరణహితంగా మార్చాలన్నది నిబంధన. ఈ నిబంధనల ప్రకారమే ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లా తెలాయ్‌కచ్చర్....
ఛత్తీస్‌గఢ్‌లోని తెలాయ్‌కచ్చర్ గ్రామంలో తీర్చిదిద్దిన ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ సంస్థ
రిజర్వాయర్‌లో చేపల పెంపకం, బోట్లు.. ఫ్లోటింగ్ రెస్టారెంట్
సింగరేణిలోనూ ఓపెన్‌కా్‌స్ట గనులు.. రిజర్వాయర్లుగా మార్చడానికి కేంద్రం అనుమతులు
(ఛత్తీస్‌గఢ్ కెనపారా నుంచి ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి)
ఏదైనా ఒక ప్రాంతంలో మైనింగ్ పూర్తైతే ఆ ప్రాంతాన్ని తిరిగి జనావాసాలకు అనుకూలంగా లేదా పర్యావరణహితంగా మార్చాలన్నది నిబంధన. ఈ నిబంధనల ప్రకారమే ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లా తెలాయ్‌కచ్చర్ గ్రామంలో బొగ్గు గనిని కోల్ ఇండియా అనుబంధ కంపెనీ సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్(ఎస్ఈసీఎల్) రిజర్వాయర్‌గా మార్చింది. గ్రామంలో 1961 నుంచి 1,472 హెక్టార్లలో బిశ్రమ్‌పూర్ ఓపెన్‌కా్‌స్ట బొగ్గు గని ఉంది. ఇక్కడ 57 ఏళ్లపాటు 387 లక్షల టన్నుల బొగ్గును వెలికి తీశారు. తర్వాత మైనింగ్ ఆపేశారు. ఈ ఓపెన్‌కాస్టులో ఎకోపార్కును ఏర్పాటు చేయాలని 2018లో నిర్ణయించారు. ఓపెన్‌కాస్టు చుట్టూ అంతకుముందు తవ్విన మట్టి గుట్టలు ఉండగా... ఆ గుట్టల మధ్యలోని ప్రాంతాన్ని రిజర్వాయర్‌గా మార్చారు. దీనికోసం ఎస్‌ఈసీఎల్ రూ.1.97 కోట్లను వెచ్చించింది. ఇప్పుడు సమీపంలోని అండర్ గ్రౌండ్(యూజీ) గనుల్లో ఊటను కూడా పంపింగ్ చేసి ఈ రిజర్వాయర్‌లో నింపుతున్నారు. ఈ రిజర్వాయర్‌లో కేజ్ కల్చర్ విధానంతో ఏటా 90టన్నుల దాకా చేపలను పెంచుతున్నారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఉంది. 11పొదుపు సంఘాలు వీటిని నిర్వహిస్తున్నాయి. దీనిపై 332 మంది మహిళలకు ఉపాధి లభిస్తోంది. జాతీయ రహదారి-43కు ఈ రిజర్వాయర్ దగ్గరగా ఉండటంతో పర్యాటకుల రాకతో ప్రతిరోజు రూ.5 వేల నుంచి 10 వేల ఆదాయాన్ని పొదుపు సంఘాలు గడిస్తున్నాయి.
ముందే ప్లాన్, నిధుల కేటారుంపు
ఎక్కడైనా అండర్‌గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ బొగ్గు గని తవ్వాలంటే తొలుత మైనింగ్ నిలిపివేత ప్రణాళికను కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో కంపెనీలు మైనింగ్ తర్వాత ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేస్తాయన్న వివరాలను పొందుపరుస్తాయి. ముందే నిధులను కేటాయిస్తాయి. ఈ నిధులను ఎస్ర్కో అకౌంట్(కేంద్రం, బొగ్గు సంస్థ నిర్వహించే ఖాతా)లో జమచేస్తారు. తవ్వకం పూర్తయి గనిని మూసేశాక.. ఆ గనిపై ఆధారపడిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు దెబ్బతిన్న ప్రకృతిని పునరుద్ధరించడం కోసం ఎస్ర్కోలో నిల్వ ఉన్న నిధులను విడుదల చేస్తారు. సింగరేణిలో కూడా పలు ఓపెన్‌కాస్ట్ గనులను రిజర్వాయర్లుగా మార్చడటానికి కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో, పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం కోసం కృత్రిమ రిజర్వాయర్లుగా ఈ గనులను మార్చుకునే పనిలో సంస్థలు పడ్డాయి.సింగరేణిలో మేడిపల్లి ఓపెన్ కాస్ట్‌ను పంప్డ్ స్టోరేజీ జలవిద్యుత్ కేంద్రం రిజర్వాయర్‌గా మార్చుకోవడానికి కేంద్రం అనుమతినివ్వడం గమనార్హం.