Share News

పంచాయతీల్లో చెక్‌ ‘వార్‌’

ABN , Publish Date - Sep 10 , 2026 | 01:03 AM

గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగానికి సంబంధించి సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌ల మధ్య ‘చెక్‌ పవర్‌’ పోరు తీవ్రరూపం దాల్చింది. ఉమ్మడి చెక్‌ పవర్‌ వివాదం రోజురోజుకూ ముదిరి పాకాన పడటంతో స్థానిక సంస్థల్లో పాలన పడకేసింది. చెక్‌ పవర్‌పై ఇరువర్గాలు పట్టువిడవకుండా సవాల్‌ విసురుతుండడంతో ప్రభుత్వం తీవ్ర తర్జనభర్జన

 పంచాయతీల్లో చెక్‌ ‘వార్‌’

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగానికి సంబంధించి సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌ల మధ్య ‘చెక్‌ పవర్‌’ పోరు తీవ్రరూపం దాల్చింది. ఉమ్మడి చెక్‌ పవర్‌ వివాదం రోజురోజుకూ ముదిరి పాకాన పడటంతో స్థానిక సంస్థల్లో పాలన పడకేసింది. చెక్‌ పవర్‌పై ఇరువర్గాలు పట్టువిడవకుండా సవాల్‌ విసురుతుండడంతో ప్రభుత్వం తీవ్ర తర్జనభర్జన పడుతోంది. పంచాయతీ నిధుల విత్‌డ్రాపై తమకే పూర్తి అధికారాలు ఉండాలని, ఉప సర్పంచులకు ఉన్న చెక్‌ పవర్‌ను తక్షణమే తొలగించాలని సర్పంచుల సంఘం పట్టుబడుతోంది. ఉప సర్పంచ్‌ల సంతకాల వల్ల నిధుల వినియోగంలో జాప్యం జరుగుతోందని, అభివృద్ది పనులకు అడ్డంకిగా మారుతోందని వారు ఆరోపిస్తున్నారు.

మరోవైపు, చెక్‌ పవర్‌ను తొలగిస్తే ఊరుకునేది లేదని ఉప సర్పంచ్‌లు భగ్గుమంటున్నారు. పంచాయతీల్లో పారదర్శకత కోసమే నాటి ప్రభుత్వం ఉమ్మడి సంతకాల నిబంధన తీసుకవచ్చిందని, తమ అధికారాల్లో కోత విధిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఉప సర్పంచ్‌ల సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు. అయితే మధ్యే మార్గంగా ఉపసర్పంచుల సంతకం చేసేందుకు వారం రోజుల గడువు తీసుక రావాలని, ఆ మేరకు చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది.

ఫ బీఆర్‌ఎస్‌ హయాంలో ఉప సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సర్పంచ్‌లతో పాటు ఉప సర్పంచ్‌లు జాయింట్‌ చెక్‌ పవర్‌ను తీసుకవచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్‌లకు వార్డు సభ్యుడితో చెక్‌పవర్‌ ఉండేది. 2018లో పాత పంచాయతీ రాజ్‌ చట్టానికి సవరణ చేసి జాయింట్‌ చెక్‌ పవర్‌ను సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌కు కల్పించింది. అలాగే సర్పంచుల రిజర్వేషన్‌ను పదేళ్లకు పెంచింది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం రిజర్వేషన్ల రొటేషన్ల విధానాన్ని ఐదేళ్లకోసారి మార్చే విధంగా సవరణ చేసింది. ఉప సర్పంచ్‌ల జాయింట్‌ చెక్‌ పవర్‌ను తొలగించాలని కొన్ని రోజులుగా సర్పంచ్‌లు డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. వారి చెక్‌ పవర్‌ తొలగిస్తారని ప్రచారం జోరుగా సాగింది. దీంతో అప్రమత్తమైన ఉపసర్పంచ్‌ల సంఘం రాష్ట్ర స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ చెక్‌ పవర్‌ను తొలగిస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉప సర్పంచ్‌ల చెక్‌ పవర్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ సర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతి పత్రాలను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్షకు వినతి పత్రం ఇచ్చారు.

ఫ లక్షలు వెచ్చించి ఉప సర్పంచ్‌లుగా ఎన్నిక..

జిల్లాలో 263 గ్రామ పంచాయతీలు ఉండగా, గడిచిన డిసెంబర్‌లో 262 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, ఉప సర్పంచ్‌లను కూడా ఎన్నుకున్నారు. సర్పంచ్‌లతోపాటు ఉప సర్పంచ్‌లతో చెక్‌ పవర్‌ అధికారం ఉండడంతో పోటీపడి ఆ పదవిని మెజార్టీ వార్డు సభ్యుల మద్దతుతో దక్కించుకున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఉప సర్పంచ్‌ల ఎన్నిక పోలింగ్‌ కేంద్రాల్లోనే జరిగింది. అక్కడ తనకు ఉప సర్పంచ్‌ పదవి కట్టబెడితే ఒక్కో వార్డు మెంబర్‌కు 50 నుంచి లక్ష రూపాయలు నజరానా ఇస్తామంటూ ఆఫర్‌ ఇచ్చారు. దీంతో డబ్బులు ఉన్న చాలా మంది వార్డు సభ్యులు పోటీపడి ఉప సర్పంచ్‌ పదవిని దక్కించుకున్నారు. కొన్ని చోట్ల వార్డు సభ్యుల మధ్యనే వేలం పాటలు కూడా జరిగాయి. ఉప సర్పంచ్‌ పదవిని దక్కించుకునేందుకు ఒక్కొక్కరు 2 నుంచి 10 లక్షల రూపాయల వరకు వెచ్చించారు. అయితే జాయింట్‌ చెక్‌పవర్‌ తొలగిస్తారని ప్రచారం జరుగుతుండడంతో అప్రమత్తమయ్యారు. చెక్‌ పవర్‌ తొలగిస్తే తమకు గ్రామంలో పెద్దగా ప్రాధాన్యం ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఫ చట్ట సవరణ దిశగా అడుగులు?

సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల మధ్య నడుస్తున్న ఈ చెక్‌ పవర్‌ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ దిశగా పంచాయతీరాజ్‌ చట్టంలో అవసరమైన సవరణలు చేసే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి చెక్‌ పవర్‌ నిబంధనను సమీక్షించి, గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా బిల్లులపై ఉప సర్పంచ్‌లు సంతకాలు చేసేందుకు వారం రోజుల గడువు ఇవ్వాలని, ఆ లోపు సంతకాలు చేయకుంటే ఆటోమేటిక్‌గా ఆ చెక్కులు పాస్‌ అయ్యే విధంగా చట్ట సవరణ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

Updated Date - Sep 10 , 2026 | 01:03 AM