Share News

చెంచులను అడవి నుంచి వేరు చేయొద్దు

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:02 AM

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పునరావాసం పేరుతో తమను అడవి నుంచి దూరం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై చెంచు సంఘీభావ వేదిక....

చెంచులను అడవి నుంచి వేరు చేయొద్దు

  • అమ్రాబాద్‌ నుంచి తరలింపుపై చెంచు సంఘీభావ వేదిక

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పునరావాసం పేరుతో తమను అడవి నుంచి దూరం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై చెంచు సంఘీభావ వేదిక(సీఎస్ఎఫ్‌) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలోని చెంచు ఆదివాసీలను అడవి నుంచి బలవంతంగా తరలించడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో నిర్వహించిన సివిల్‌ సొసైటీ రౌండ్‌ టేబుల్‌ సమావేశం ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురష్కరించుకుని చెంచు సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో ఆదివాసీలు తమ గోడును వెళ్లగక్కారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ.. పెట్టుబడిదారీ వ్యవస్థ ఆదివాసుల నిస్వార్థ, సామూహిక జీవన విధానాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో చెంచులను అడవుల నుంచి వెళ్లగొట్టాలని చూస్తోందని ఆరోపించారు. కవ్వాల్‌ రిజర్వ్‌లోని మైనంపేట, రాంపూర్‌ నుంచి ఆదివాసులను తరలించడం, నిర్వాసితులకు ఇచ్చిన హామీ ప్రకారం.. భూమి, నగదు పరిహారం కోసం ఇంకా ఎదురు చూస్తున్నారని, ప్రస్తుతం వారంతా భూమిలేని కూలీలుగా మారారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు పలు అంశాలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. పునరావాసం పేరిట బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు తమకు రావాల్సిన రుణాలను, పథకాలను నిరాకరిస్తున్నాయని సార్లపల్లి వంటి గ్రామాల ఆదివాసీలు ఉదాహరణలతో వివరించారు.

Updated Date - Apr 22 , 2026 | 05:02 AM