Share News

గాంధీ ఆస్పత్రి నుంచి రిమాండ్‌ ఖైదీ పరారీ

ABN , Publish Date - May 27 , 2026 | 05:32 AM

వైద్యం కోసం చంచల్‌గూడ్‌ జైలు నుంచి గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఓ ఖైదీ.. ఎస్కార్ట్‌ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. బాత్‌రూమ్‌ కిటికీలో నుంచి దూకి పారిపోయాడు.

గాంధీ ఆస్పత్రి నుంచి రిమాండ్‌ ఖైదీ పరారీ

  • ఇనుప మేకులు మింగడంతో చంచల్‌గూడ జైలు నుంచి ఆస్పత్రికి

  • బాత్‌రూమ్‌ కిటికీలో నుంచి దూకి పరార్‌

  • రెండు నెలల వ్యవధిలో మూడో ఘటన

హైదరాబాద్‌ సిటీ/అడ్డగుట్ట, మే 26 (ఆంధ్రజ్యోతి): వైద్యం కోసం చంచల్‌గూడ్‌ జైలు నుంచి గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఓ ఖైదీ.. ఎస్కార్ట్‌ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. బాత్‌రూమ్‌ కిటికీలో నుంచి దూకి పారిపోయాడు. ఇందుకు సంబంధించి తిరుమలగిరి, చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి మెహ్రానగర్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ అమీర్‌ హుస్సేన్‌ (20)ను సెల్‌ఫోన్‌ చోరీ కేసులో అరెస్టు చేసిన తిరుమలగిరి పోలీసులు ఈనెల 19న చంచల్‌గూడ జైలుకు తరలించారు. రిమాండ్‌ ఖైదీగా జూన్‌ 1 వరకు జైలులో ఉండాల్సిన అమీర్‌ హుస్సేన్‌ ఈ నెల 24న జైలులో ఐదు ఇనుప మేకులు మింగి అపస్మారక స్ధితికి చేరుకున్నాడు. గమనించిన జైలు అధికారులు పోలీసులు ఎస్కార్ట్‌తో సయ్యద్‌ అమీర్‌ హుస్సేన్‌ను అదే రోజు గాంధీ ఆస్పత్రికి తరలించారు. హుస్సేన్‌కు ఎక్స్‌రే తీయాలని వైద్యులు సిఫారసు చేయగా ఎస్కార్టుగా వచ్చిన పోలీసులు అనిల్‌ కుమార్‌, ప్రవీణ్‌ సాయంత్రం ఆరున్నర గంటలప్పుడు హుస్సేన్‌ను టీఎంటీ వార్డులో చేర్పించారు. ఆ సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లాలని హుస్సేన్‌ చెప్పగా ఎస్కార్టు పోలీసులు అనుమతించారు. అయితే, హుస్సేన్‌ ఎంతకీ బయటికి రాకపోవడంతో పోలీసులు బలవంతంగా తలుపులు తీసి చూసే సరికి లోపల కనిపించలేదు. బాత్‌ రూం కిటికీలో నుంచి బయటకు దూకి హుస్సేన్‌ పరారైనట్టు గుర్తించారు. పరిసరాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో ఎస్కార్టు పోలీసులు చంచల్‌గూడ జైలు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పరారీలో ఉన్న హుస్సేన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, పోలీసుల కళ్లుగప్పి ఖైదీలు పారిపోవడం రెండు నెలల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం. వారిద్దరినీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో మరో ఖైదీ పరారు కావడం సంచలనంగా మారింది.

Updated Date - May 27 , 2026 | 05:32 AM