జైళ్లు.. సంస్కరణ కేంద్రాలు
ABN , Publish Date - May 13 , 2026 | 04:30 AM
జైళ్లు కేవలం ఖైదీలకు శిక్షను అమలుపరిచే ప్రదేశాలుగా మాత్రమే కాకుండా.. వారిలో మానసిక పరివర్తన తెచ్చే సంస్కరణ కేంద్రాలుగా మారాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు.
ఖైదీల్లో మానసిక పరివర్తన తీసుకురావాలి.. కరుడుగట్టిన నేరగాళ్లతో మాత్రం కఠినంగా ఉండాలి
గవర్నర్ శివపత్రాప్ శుక్లా
చంచల్‌గూడ జైల్లో ఫీల్ ద జైల్ కేంద్రం, మ్యూజియం ప్రారంభం
హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): జైళ్లు కేవలం ఖైదీలకు శిక్షను అమలుపరిచే ప్రదేశాలుగా మాత్రమే కాకుండా.. వారిలో మానసిక పరివర్తన తెచ్చే సంస్కరణ కేంద్రాలుగా మారాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు. ఖైదీల్లో ఆత్మపరిశీలన, వ్యక్తిత్వ వికాసం, కొత్త జీవితానికి నాంది పలికేలా జైళ్లు పనిచేయాలన్నారు. చంచల్‌గూడలో జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జైలు మ్యూజియం, ‘ఫీల్ ద జైల్’ కేంద్రాన్ని గవర్నర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరస్తులందరూ పుట్టుకతోనే నేరస్తులు కాదని, కొన్నిసార్లు పరిస్థితులు వారిని అలా మారుస్తాయని అన్నారు. అందుకే వారికి పరివర్తన చెందే అవకాశం ఇవ్వాలన్నారు. జైలు గదులు కేవలం బందీఖానాలుగా కాకుండా ఆత్మచింతన చేసుకునే ప్రదేశాలుగా ఉండాలని సూచించారు. కరుడుగట్టిన నేరగాళ్ల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తాను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు జైలుకు వెళ్లిన రోజులను ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల 20 రోజులు జైల్లో గడిపానని, నాటి పరిస్థితుల్ని స్వయంగా చూశానని తెలిపారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా జైళ్లశాఖ బాధ్యతలు చేపట్టిన సమయంలో.. తనకున్న జైలు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జైళ్లలో అనేక సంస్కరణలు చేపట్టానని ఆయన చెప్పారు.
వినూత్న విద్యగా ‘ఫీల్ ద జైల్’..
‘ఫీల్ ద జైల్’ అనేది వినూత్న విద్యా కార్యక్రమమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నా రు. స్వేచ్ఛ ఎంత ముఖ్యమైనదో, చట్టాన్ని పా టించడం సమాజానికి ఎలా మేలు చేస్తుందో ఈ కార్యక్రమం ప్రజలకు గుర్తు చేస్తుందని చెప్పారు. జైలు మ్యూజియం పర్యాటక ఆకర్షణగా మాత్ర మే కాకుండా.. విద్య, పరిశోధన, సామాజిక చైతన్యానికి శక్తివంతమైన వేదికగా నిలుస్తుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. కాగా, జైలు మ్యూ జియం, ఫీల్ ద జైల్‌ను ప్రా రంభించడం తెలంగాణ రాష్ట్ర జైళ్లశాఖలో కొత్త అధ్యాయమ ని జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా అన్నారు. జైలు మ్యూజియం లో ప్రాచీన శిక్షా విధానాల నుంచి ఆధునిక సంస్కరణాత్మక కారాగార వ్యవస్థల వరకు జరిగిన పరిణామాన్ని వివరించే గ్యాలరీలు, శిక్షా విధానాల ప్ర దర్శనలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జైలు మ్యూజియం, ఫీల్ ద జైల్ రూ పకల్పనకు కృషిచేసిన చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, ఇతర అధికారులు, సిబ్బందికి గవర్నర్ జ్ఞాపికలు అందజేశారు.
జైలు మ్యూజియంలో చారిత్రక వస్తువుల ప్రదర్శన
తెలంగాణ జైళ్లశాఖ చంచల్‌గూడ జైలు మ్యూజియంను మంగళవారం నుంచి ప్రజలకు అందుబాటులో తెచ్చింది. మ్యూజియంలో పాతకాలం నాటి జైళ్ల పరిస్థితులు, ఖైదీల జీవితం, అప్పటి చారిత్రక వస్తువులను ప్రదర్శిస్తున్నారు. నాటి నుంచి నేటి జైళ్ల సంస్కరణల వరకు వచ్చిన మార్పులను పెయింటింగ్‌ల ద్వారా ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ చరిత్ర, నిజాం చరిత్ర, భారత స్వాతంత్య్ర ఉద్యమ సంఘటనల్ని పెయింటింగ్ చేయించారు. బ్రిటిష్ కాలం నాటి ఫొటోలు కూడా గదుల్లో చూడవచ్చు, లండన్ నుంచి నిజాం నవాబు తెప్పించిన కంచు గంటను ఏర్పాటు చేశారు. టైప్ రైటర్లు, అప్పటి రేడియోలు, పెన్నులు, వాల్‌క్లాక్‌లు, గంటలు ఇలా ప్రతీ వస్తువు ప్రదర్శనలో పెట్టి అప్పటి జైళ్ల కార్యకలాపాలపై అవగాహన కల్పిస్తున్నారు.