Share News

నాదే కాదు.. హరీశ్‌ ఫోన్లూ ట్యాప్‌ చేశారు

ABN , Publish Date - Jun 07 , 2026 | 06:48 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా గత కేసీఆర్‌ ప్రభుత్వం వేలాది మంది వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసిందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

నాదే కాదు.. హరీశ్‌ ఫోన్లూ ట్యాప్‌ చేశారు

  • అధికారం కోసం కేసీఆర్‌ ఎంతకైనా తెగిస్తారు: చామల

  • ట్యాపింగ్‌ కేసులో చామల వాంగ్మూలం తీసుకున్న సిట్‌

హైదరాబాద్‌, జూన్‌6 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా గత కేసీఆర్‌ ప్రభుత్వం వేలాది మంది వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసిందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తన ఫోనే కాదని, అప్పట్లో మంత్రిగా ఉన్న హరీశ్‌రావు ఫోన్‌నూ ట్యాప్‌ చేశారని పేర్కొన్నారు. హరీశ్‌.. ఈ విషయాన్ని కాదనగలరా? అని ప్రశ్నించారు. ఆ భయంతోనే పీఏ, కారు డ్రైవర్లను సైతం హరీశ్‌ మార్చుకున్నారని తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి సిట్‌ అధికారులు శనివారం ఎంపీ చామల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం కిరణ్‌ మీడియాతో మాట్లాడుతూ 2023లో తన ఫోన్‌ ట్యాపింగ్‌ అయిందని సిట్‌ అధికారులు తెలిపారన్నారు. అప్పట్లో తాను టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌గా పని చేశానని, నాటి పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి సన్నిహితంగా ఉన్నందునే తన ఫోన్‌ను టాపింగ్‌ చేశారని ఆరోపించారు. అధికార దుర్వినియోగంలో కేసీఆర్‌ను మించిన వారెవ్వరూ లేరని, అధికారం కోసం ఆయన ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిన వారెవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు.

Updated Date - Jun 07 , 2026 | 06:48 AM