Maoists New Strategy: డెడ్‌లైన్ తర్వాత ఒక్క దళమైనా మిగలాలి!
ABN , Publish Date - Jan 05 , 2026 | 03:06 AM
దేశంలో నక్సలైట్లను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు అయిన మార్చి 31వ తేదీ తర్వాత కూడా మనుగడ సాగించి, తమను నిర్మూలించటం సాధ్యం కాదని పాలకులకు సవాల్ విసరాలని మావోయిస్టులు...
మావోయిస్టుల కొత్త వ్యూహం
తమను నిర్మూలించలేరని మార్చి 31 తర్వాత సవాల్ విసిరే ఎత్తుగడ
తిప్పిరి తిరుపతి నేతృత్వంలో దళాలు కదులుతున్నట్లు గుర్తింపు
కేంద్ర కమిటీలోని తెలంగాణవారు నలుగురు లొంగుబాటుకు నో
డెడ్‌లైన్ ముగిసేవరకు ప్రాణాలు కాపాడుకోవడంపైనే దృష్టి
హైదరాబాద్, జనవరి 4(ఆంధ్రజ్యోతి): దేశంలో నక్సలైట్లను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు అయిన మార్చి 31వ తేదీ తర్వాత కూడా మనుగడ సాగించి, తమను నిర్మూలించటం సాధ్యం కాదని పాలకులకు సవాల్ విసరాలని మావోయిస్టులు భావిస్తున్నట్లు తెలిసింది. అందుకోసం పార్టీ అగ్రనేతలు కొత్త వ్యూహాలు సిద్ధం చేసినట్లు ఇటీవల లొంగిపోయిన కొందరు కీలక నేతల ద్వారా పోలీసులు తెలుసుకున్నట్లు సమాచారం. పార్టీని నడిపిస్తున్న అగ్రనాయకత్వం దళాలను కాపాడుకోవడానికి కొత్త ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు ఊహించని ప్రదేశాలకు వెళ్లి తలదాచుకోవాలని దళాలకు పార్టీ సూచించినట్లు సమాచారం. మార్చి 31లోపు ఆపరేషన్ కగార్‌ను పూర్తిచేసేందుకు భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరైనా మైదాన ప్రాంతాలకు చేరి, నమ్మకస్తుల సహకారంతో ప్రాణాలు కాపాడుకుని డెడ్‌లైన్ దాటిన తర్వాత బయటకు వచ్చి, మావోయిస్టు పార్టీని నిర్మూలించడం ప్రభుత్వ తరం కాదని సవాల్ విసరాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహం పన్నిందని నిఘావర్గాలకు సమాచారం అందింది. కాగా, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్, ఒడిశా, జార్ఖండ్‌రాష్ట్రాల్లో కొద్దిగా మిగిలిన మావోయిస్టులు సురక్షిత ప్రాంతాలను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీలో తెలంగాణలో మిగిలిన 17 మందిలో 8 మంది కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త సారధిగా ప్రచారమవుతున్న తిప్పిరి తిరుపతితో పాటు బడే చొక్కారావు, ముప్పిడి సాంబయ్య, లోకేటి చందర్‌రావుల ఆధ్వర్యంలో దళాలు కదులుతున్నట్లు నిఘా వర్గా లు అనుమానిస్తున్నాయి. కేంద్ర కమిటీలోని మిగిలిన నలుగురు తెలంగాణ వాసులు లొంగుబాటుకు సిద్ధంగా లేరన్న సమాచారం పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినటంతో కొద్దిమందితోనే పార్టీ ముఖ్యులు కదులుతున్నారని, తిప్పిరి తిరుపతివద్ద సైతం 20 మందికి మించి దళ సభ్యులు లేరని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. రాయ్‌పూర్‌లో గత నెలలో జరిగిన డీజీపీల సమావేశంలో మావోయిస్టు పార్టీపై చర్చ జరిగినట్లు సమాచారం. ఏ రాష్ట్రం వారు వచ్చినా ఆహ్వానిస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించటంతో లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నవారు ఇటువైపు అడుగులు వేస్తున్నారు.