మూడేళ్లపాటు నిధులు వినియోగించుకోకపోతేకేంద్ర పథకాలు ఇవ్వం
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:11 AM
కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను వరుసగా మూడేళ్లపాటు సరిగ్గా వినియోగించుకోకపోతే.. మున్ముందు కేంద్ర పథకాలు అందకుండా కట్టడి చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు అన్నారు.
కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కేఎల్ కాంతారావు
‘క్యాడ్‌వాం’లో తెలంగాణ ఎందుకు చేరట్లేదని ప్రశ్న
భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరిక
నేడు దేవాదుల ఎత్తిపోతల పథకం పరిశీలన
బ్రిజేష్ ట్రైబ్యునల్ అవార్డు అమల్లోకి తేవాలి: కర్ణాటక
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను వరుసగా మూడేళ్లపాటు సరిగ్గా వినియోగించుకోకపోతే.. మున్ముందు కేంద్ర పథకాలు అందకుండా కట్టడి చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు అన్నారు. రానున్న రోజుల్లో ఆయకట్టు ఆధునికీకరణ, అభివృద్ధి, నీటి యాజమాన్యం(క్యాడ్‌వాం) కీలక భూమిక పోషించనుందన్న ఆయన.. ఆ ప్రాజెక్టులో తెలంగాణ ఎందుకు చేరట్లేదని ప్రశ్నించారు. అందులో చేరకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్‌హెచ్చార్డీ)లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సు జరిగింది. దీనికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రాలవారీగా కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు.. ఫ్లడ్ ప్లెయిన్ జోనింగ్, డ్రిప్, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన(పీఎంకేఎ్‌సవై), క్యాడ్‌వాం, ఆనకట్టల భద్రత చట్టం-2021 అమలు వంటి అంశాల పురోగతిపై కాంతారావు సమీక్ష జరిపారు. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో ఉన్న దేవాదుల, రాజీవ్ భీమా, పాలెంవాగు ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయట్లేదని ప్రశ్నించారు. నీటి వనరుల సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇవ్వాలనే ఆలోచన ఉందని.. నీటి సంరక్షణ, నియంత్రణతో పాటు ఐదు కేటగిరీల్లో ఈ ర్యాంకులు ఇవ్వాలని యోచిస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా.. పీఎంకేఎ్‌సవైలో ఉన్న దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని కాంతారావు శుక్రవారం పరిశీలించనున్నారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని శుక్రవారం జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) చైర్మన్ అనిల్ జైన్ పరిశీలించనున్నారు. ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల సూచనల ప్రకారం ప్రాజెక్టు పునరుద్ధరణపై తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, సమీక్ష చేయనున్నారు. కాగా, కృష్ణా ట్రైబ్యునల్-2 (జస్టిస్ బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్) తీర్పు వెలువడి పదేళ్లవుతున్నా అమలు కావట్లేదని.. సుప్రీంకోర్టులో కేసు ఉండడమే దీనికి కారణమని.. దాని అమలుకు సహకరించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ట్రైబ్యునల్ అవార్డు అమలు కాకపోవడంతో కేటాయింపుల మేరకు నీటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందని పేర్కొంది.
దేవాదుల గడువును పెంచాలి: తెలంగాణ
ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో ఉన్న దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసే గడువును వచ్చే ఏడాదికి పెంచాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ.శ్రీధర్ కోరారు. ఈ పథకం కింద భారీగా భూసేకరణ చేయాల్సి ఉందని, పలు కేసులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సత్వర సాగు నీటి ప్రయోజన పథకం కింద ఆరు ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మరో 3 పూర్తికావొచ్చాయని తెలిపారు. దేవాదుల, పాలెంవాగును 2026-30 ఆర్థిక సంవత్సరం జాబితాలో చేర్చాలని సూచించారు. చనాకా కొరటా డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్, ముక్తేశ్వర్(చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి, మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం, పాలమూరు-రంగారెడ్డి, మొండికుంటవాగు ఎత్తిపోతల పథకాలకు పీఎంకేఎ్‌సవై కింద సహాయం అందించాలని, ఇందులో చనాకా కొరాటా, ముక్తేశ్వర్‌కు ఇన్వె్‌స్టమెంట్ క్లియరెన్స్ లభించిందని గుర్తు చేశారు.