Share News

Water Dispute: జల వివాదాలపై కమిటీ!

ABN , Publish Date - Jan 03 , 2026 | 03:38 AM

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు రాష్ట్రాల మధ్య జలాలను న్యాయంగా, సమర్థవంతంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పంచుకోవడానికి.....

Water Dispute: జల వివాదాలపై కమిటీ!

  • 13 మందితో ఏర్పాటు చేసిన కేంద్ర జలశక్తి శాఖ

  • కమిటీలో ఇరు రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున అధికారులు

  • కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లకూ స్థానం.. కేంద్ర జలసంఘం చైర్మన్‌ సారథ్యం

  • 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని గడువు.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, జనవరి 2(ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు రాష్ట్రాల మధ్య జలాలను న్యాయంగా, సమర్థవంతంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పంచుకోవడానికి అవసరమైన ఆచరణీయ పరిష్కారాలని సూచించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. శుక్రవారం, కేంద్ర జలశక్తి శాఖ సీనియర్‌ జాయింట్‌ కమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ సింగ్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ కమిటీ రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, నిర్వహణలో ఉన్న సమస్యలను సమగ్రంగా, సాంకేతిక కోణంలో పరిశీలించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న వివాదాలను అధ్యయనం చేయనుంది. గతేడాది జూలై 16న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్వర్యంలో జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలోతీసుకున్న నిర్ణయం మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఛైర్మన్‌ను ఈ కమిటీకి చైర్మన్‌గా, 12మందిని సభ్యులుగా నియమించారు. సభ్యులుగా ఇరురాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున ఉన్నతాధికారులు, కృష్ణా, గోదావరి నదుల యజమాన్య బోర్డుల చైర్మన్లు, జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) చీఫ్‌ ఇంజనీర్‌ను కమిటీలో నియమించారు. కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజనీర్‌ మెంబర్‌-సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఏపీనుంచి ప్రతినిధులుగా జలవనరులశాఖకు చెం దిన స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, సలహాదారు, ఇంజనీర్‌ ఇన్‌చీఫ్‌(ఇరిగేషన్‌),చీఫ్‌ ఇంజనీర్‌ సభ్యులుగా ఉం టారు. తెలంగాణనుంచి ప్రతినిధులుగా నీటిపారుదల, జలవనరులశాఖ సలహాదారు, నీటిపారుదల, సీఏడీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, స్పెషల్‌ సెక్రటరీ, ఇంజనీర్‌ఇన్‌ చీఫ్‌(జనరల్‌) సభ్యులుగా ఉంటారు.


మూడు నెలల్లో నివేదిక

ఏర్పాటైన నాటి నుంచి మూడు నెలల్లోగా కమిటీ తన నివేదికను కేంద్రానికి సమర్పించాలని జలశక్తి శాఖ స్పష్టం చేసింది. కమిటీ నీటి నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలను సమగ్రంగా, సాంకేతికంగా అధ్యయనం చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిశీలించి, నీటిని న్యాయంగా, సమర్థవంతంగా పంచుకునేందుకు అవసరమైన ఆచరణాత్మక పరిష్కారాలను సూచించాల్సి ఉంటుంది. అవసరమైతే ఇతర సంస్థల నిపుణులను కూడా చర్చలకు ఆహ్వానించే అధికారం కమిటీకి కల్పించారు. కమిటీ సమావేశాలు, క్షేత్ర స్థాయి పర్యటనలకు అయ్యే ఖర్చులను సంబంధిత శాఖలే భరించాల్సి ఉంటుంది.

నాటి నిర్ణయం మేరకు..

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి పంపిణీ సమస్యలపై చర్చించేందుకు గతేడాది జూలై 16న శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నీటి నిర్వహణలోని కీలకాంశాలు చర్చకు వచ్చాయి. కృష్ణా బేసిన్‌లో నీటి పారుదల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు టెలీమెట్రీ పరికరాల ఏర్పాటుకు 2రాష్ట్రాలు అంగీకరించాయి. శ్రీశైలం ఆనకట్టను పరిరక్షించేందుకు, అవసరమైన మరమ్మతులను తక్షణమే చేపట్టాలని నిర్ణయించారు. కేఆర్‌ఎంబీ కార్యాలయాన్ని విజయవాడ లేదా అమరావతికి మార్చేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. మిగిలిన అంశాలను సమగ్రంగా, సాంకేతిక కోణంలో పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు చెందిన సీనియర్‌ అధికారులు, సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని అప్పట్లోనే నిర్ణయించారు. నాడు తెలంగాణ సీఎం, నీటి పారుదల మంత్రి ఈ ప్రతిపాదన చేయగా, ఏపీ అంగీకరించింది. రాష్ట్ర విభజన చట్టానికి, బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డుకి వ్యతిరేకంగా ఏపీ పోలవరం-బనకచర్ల/నల్లమల్లసాగర్‌ అనుసంధానం ప్రాజెక్టును ప్రతిపాదించడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనితో పాటు ఏపీ, తెలంగాణ మధ్య 66, 44 నిష్పత్తిలో కృష్ణా జలాలను తాత్కాలికంగా పంపిణీ చేస్తూ రాష్ట్ర విభజన తర్వాత తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి, 50:50 నిష్పత్తిలో పంపకాలను జరపాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ ద్వారా ఏపీ కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు తరలించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశాలపై కమిటీ కేంద్రానికి సూచనలు చేయనుంది.

Updated Date - Jan 03 , 2026 | 03:38 AM