Share News

మేడారం జాతరకు కేంద్రం 3.7 కోట్లు

ABN , Publish Date - Jan 24 , 2026 | 04:50 AM

మేడారం జాతర కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ప్రత్యేక చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ.....

మేడారం జాతరకు కేంద్రం 3.7 కోట్లు

  • విడుదల చేసిన కేంద్ర పర్యాటక, గిరిజన మంత్రిత్వ శాఖలు

  • కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవతోనే

హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): మేడారం జాతర కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ప్రత్యేక చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖలు రూ.3.7 కోట్ల నిధులను విడుదల చేశాయి. ఈ మేరకు కేంద్రం నుంచి శుక్రవారం ప్రకటన విడుదలైంది. రెండేళ్లకోసారి మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీ్‌సగఢ్‌ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మేడారం ప్రాంతాన్ని జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్థి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘గిరిజన సర్క్యూట్‌’ పేరుతో గతంలోనే రూ.80 కోట్ల నిధులతో మేడారం పరిసర ప్రాంతాల్లో అభివృద్థి పనులు చేపట్టింది. ఈ సర్క్యూట్‌లో భాగంగా ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో మౌలికవసతులు కల్పించారు. రామప్ప దేవాలయం అభివృద్థి కోసం కేంద్రం దాదాపు రూ.140 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇది మేడారం-రామప్ప-లక్నవరం ప్రాంతాన్ని ఒక సమగ్ర పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగుగా భావిస్తున్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం, జాతర జరిగే నాలుగు రోజుల పాటు దక్షిణ మధ్య రైల్వే 30 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దీని ద్వారా భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా మేడారం చేరుకునే వీలుంది.

Updated Date - Jan 24 , 2026 | 04:50 AM