తెలుగు రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమంపై కేంద్రం ప్రశంసలు
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:34 AM
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమ పథకాల అమలు, ఐటీడీఏల పనితీరును కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ డైరెక్టర్ డాక్టర్ వర్నాలి డేకా ప్రశంసించారు. ఇక్కడ అమలవుతున్న..
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమ పథకాల అమలు, ఐటీడీఏల పనితీరును కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ డైరెక్టర్ డాక్టర్ వర్నాలి డేకా ప్రశంసించారు. ఇక్కడ అమలవుతున్న ఉత్తమ విధానాలను దేశవ్యాప్తంగా వర్తింపజేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఇందుకోసం మే నెలలో జాతీయ స్థాయి కార్యశాల నిర్వహించబోతున్నట్లు ఆమె వెల్లడించారు. శనివారం మాసబ్ ట్యాంక్‌లోని గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ఐటీడీఏల బలోపేతంపై నిర్వహించిన ఒక రోజు ప్రాంతీయ కార్యశాలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజన యువతకు విద్యతో పాటు ఉపాధి అవకాశాలు సైతం కల్పించాలని... ఇందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సహకారంతో శిక్షణ ఇచ్చి ప్రాంగణ నియామకాలను నిర్వహించాలన్నారు. ఆశ్రమ పాఠశాలల అభివృద్ధి, స్థానిక భాషల్లో ప్రాథమిక విద్య అందించడం ద్వారా గిరిజన విద్యార్థుల్లో మేఽథోశక్తిని పెంపొందించాలని తీర్మానించారు. పదో తరగతి ఫలితాల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించిన వారి వ్యూహాలను అన్ని చోట్ల అమలు చేయాలన్నారు. గిరిజన సహకార సంస్థల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌లు, ఎల్పీజీ పంపిణీ కేంద్రాలు తదితరాలను విస్తరించాలని నిర్ణయించారు. అటవీహక్కుల చట్టం సమర్థ అమలు, వలసల నివారణపై క్షేత్రస్థాయి కార్యాచరణ రూపొందించాలన్నారు. ఐటీడీఏలలో కేంద్రీకృత పాలనా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా పరిపాలనలో జాప్యాన్ని నివారించాలని నిర్దేశించారు. సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ సంచాలకుడు సంతోష్, అదనపు సంచాలకుడు సర్వేశ్వర్‌రెడ్డి, టీసీఆర్ అండ్ టీఐ సంచాలకుడు సముజ్వల పాల్గొన్నారు.