Share News

వరి సాగుకు కళ్లెం

ABN , Publish Date - May 28 , 2026 | 03:36 AM

ప్రతియేటా అసాధారణ స్థాయిలో పెరుగుతున్న వరి విస్తీర్ణానికి కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించింది.

వరి సాగుకు కళ్లెం

  • తెలంగాణలో 25 లక్షల ఎకరాలు తగ్గించాలని కేంద్రం టార్గెట్‌

  • దేశవ్యాప్తంగా 2.50 కోట్ల ఎకరాల విస్తీర్ణం తగ్గించే లక్ష్యం

  • ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి

  • ప్రత్యామ్నాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్‌

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి) : ప్రతియేటా అసాధారణ స్థాయిలో పెరుగుతున్న వరి విస్తీర్ణానికి కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించింది. వరి ధాన్యం అధికోత్పత్తి, నిల్వ సమస్యలు, ఇంతర పంటల విస్తీర్ణం, ఉత్పత్తి తగ్గిపోవడంతో ఆందోళనకు గురవుతున్న కేంద్రం.. పంటల వైవిధ్యంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో వరి సాగు అధికంగా ఉండే పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్‌ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో ప్రతియేటా 5 లక్షల ఎకరాల చొప్పున ఐదేళ్లలో 25 లక్షల ఎకరాల వరి సాగు విస్తీర్ణం తగ్గించాలని టార్గెట్‌ పెట్టింది. దేశ వ్యాప్తంగా ఐదేళ్లలో 2.50 కోట్ల ఎకరాల వరి విస్తీర్ణం తగ్గించాలని లక్ష్యం పెట్టుకోగా.. అందులో తెలంగాణ వాటానే 10 శాతం ఉండటం గమనార్హం. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్న విషయం విదితమే. మూడేళ్లలో రాష్ట్రంలో 16 లక్షల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. 2023-24 ఖరీ్‌ఫలో 65 లక్షల ఎకరాలు, యాసంగిలో 52 లక్షల ఎకరాలు కలిపి ఏడాదిలో 117 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 2024-25 ఖరీ్‌ఫలో 66 లక్షల ఎకరాలు, యాసంగిలో 60 లక్షల ఎకరాలు కలిపి ఏడాదిలో 126 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 2025-26కు వచ్చేసరికి మరింతగా పెరిగింది. ఖరీ్‌ఫలో 67 లక్షల ఎకరాలు, యాసంగిలో 66 లక్షల ఎకరాలు కలిపి ఏడాదిలో 133 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అంటే కేవలం మూడేళ్లలో 16 లక్షల ఎకరాలు పెరిగింది. ప్రతి సీజన్‌కు సగటున కోటిన్నర టన్నుల చొప్పున ఏడాదికి 3కోట్ల టన్నుల వరి ధాన్యం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నదంటే అతిశయోక్తి కాదు. యాంత్రీకరణ, సాగు సులభతరం కావడం, ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ఇవ్వడం, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా తమ ఖాతాల్లోకే డబ్బులు జమ అవుతుండడంతో రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. సన్న ధాన్యానికి రూ.500 బోనస్‌ అందిస్తుండడం.. వరి సాగు పెరగడానికి మరో కారణమని భావిస్తున్నారు.


దేశ వ్యాప్తంగా ధాన్యం ఉత్పత్తి పెరుగుదల

దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి ప్రతియేటా అసాధారణ స్థాయిలో పెరుగుతోంది. దీంతో నిల్వలు పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ గిడ్డంగుల్లో స్థలం లేకుండా పోయింది. బియ్యం నిల్వలు ఖాళీ చేసేందుకు పీడీఎస్‌ బియ్యం మూడు నెలల కోటా ఒకేసారి ఇవ్వాల్సి వస్తోంది. అయినా నిల్వలు తరగటం లేదు. పైగా బాయిల్డ్‌ రైస్‌ వినియోగం కూడా తగ్గిపోయింది. దీంతో యాసంగి సీజన్‌లో ఉత్పత్తి చేసిన ధాన్యానికి డిమాండ్‌ లేకుండా పోతోంది. మరోవైపు పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు గణనీయంగా తగ్గిపోయింది. కూరగాయలు కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వరి స్థానంలో ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. అన్ని రాష్ట్రాలు పంటల మార్పిడి విధానాలు అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుండటం గమనార్హం. వంట నూనెల ఉత్పత్తిలో దేశం వెనకబాటులో ఉంది. దేశంలో వంట నూనెల వార్షిక వినియోగం 260 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండగా.. ఇందులో 60 శాతం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా పామాయిల్‌ వినియోగంలో 95 శాతం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో పామాయుల్‌ సాగుపై తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్‌ పెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 98,111 హెక్టార్లలో పామాయిల్‌ సాగవుతోంది. 2026- 27 సంవత్సరానికి మరో 34 వేల హెక్టార్లలో పామాయిల్‌ సాగుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అయితే క్రూడ్‌ పామాయుల్‌పై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించటంతో దిగుమతి సుంకం 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గిపోయింది. దీంతో దిగుమతులకు మరింత ప్రోత్సాహం పెరిగింది. ఈ ప్రభావం దేశీయ క్రూడ్‌ పామాయుల్‌ ధరలపై పడింది. దీంతో పామాయిల్‌ గెలల ధరలు పడిపోతున్నాయి. 2018లో అమలులో ఉన్న 44 శాతం దిగుమతి సుంకంతో రైతులకు మంచి లాభాలు వచ్చాయి. ఇప్పుడు లాభాలు తగ్గిపోతున్నాయి. రైతులు మెట్రిక్‌ టన్నుకు రూ. 25 వేల చొప్పున గిట్టుబాటు ధర కోరుతున్నారు.

పప్పు దినుసులు, ఇతర నూనెగింజలు, కూరగాయల సాగు కూడా పెరగాల్సిందే

పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల ఉత్పత్తి రాష్ట్రంలో చాలా తక్కువగా ఉంది. ఏడాదికి 12 లక్షల టన్నుల పప్పు ధాన్యాల అవసరం రాష్ట్రంలో ఉంటే.. 6 లక్షల టన్నులే ఉత్పత్తి అవుతున్నాయి. నూనెగింజల వార్షిక అవసరం 16 లక్షల టన్నులుంటే.. కేవలం 7 లక్షల టన్నులే ఉత్పత్తి అవుతున్నాయి. కూరగాయల వినియోగం 49 లక్షల టన్నులుంటే.. 31 లక్షల టన్నులే ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. ఆలుగడ్డ లోటు కూడా ఏడాదికి 10 లక్షల టన్నులు ఉంది. ఉల్లిగడ్డ వినియోగం 6 లక్షల టన్నులు ఉంటే.. 3 లక్షల టన్నులు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. పూలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. పంటల మార్పిడి చేపడితే వీటి సాగు పెరుగుతుంది.

Updated Date - May 28 , 2026 | 03:36 AM