‘గాంధీ సరోవర్’కు కేంద్రం ఓకే
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:51 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బాపూ ఘాట్ ప్రాజెక్టులో రక్షణ శాఖ భూముల వినియోగానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
రక్షణ శాఖ భూముల వినియోగానికి ఆమోదం.. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా బాపూ ఘాట్
228 ఎకరాల్లో అభివృద్ధి.. అందులో 115 ఎకరాలు
ప్రభుత్వ భూమి, 30 ఎకరాలు ప్రైవేటు భూమి
మరో 83 ఎకరాలకుపైగా.. రక్షణ శాఖ భూమి
విద్య, పర్యాటకం, ఆధ్యాత్మికతలకు నిలయంగా
సర్కిల్ ఆఫ్ యూనిటీ.. లండన్ ఐ తరహాలో భారీ చరఖా నిర్మాణం
సింగపూర్ కన్సార్షియం ప్రణాళికలు.. రెండేళ్లలో పూర్తికి సన్నాహాలు
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బాపూ ఘాట్ ప్రాజెక్టులో రక్షణ శాఖ భూముల వినియోగానికి కేంద్రం ఆమోదం తెలిపింది. సుమారు 228 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేయగా అందులో 115 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ భూమి, 30 ఎకరాలు ప్రైవేటు భూమి. మరో 83 ఎకరాలు రక్షణ శాఖ పరిధిలోనే ఉన్నాయి. ఆ భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. మరో నెల రోజుల్లో ఆ భూములను మూసీ అధికారులకు అప్పగించనున్నట్లు ఎంఆర్‌డీసీఎల్ ఎండీ నరసింహారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆ భూముల్లో ఉన్న రక్షణ శాఖ శిక్షణ షెడ్లను తొలగించిన వెంటనే.. బాపూ ఘాట్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మూసీ ప్రాజెక్టు పునరుజ్జీవం, సుందరీకరణ పనుల్లో భాగంగా తొలిదశలో బాపూ ఘాట్‌ను అంతర్జాతీయ పర్యాటక, విజ్ఞాన, వినోద కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను సింగపూర్ కన్సార్షియం ‘మెయిన్ హార్ట్’ సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
153 అడుగుల బాపూ విగ్రహం..
బాపూ ఘాట్ అభివృద్ధి పనుల్లో భాగంగా.. 150 నుంచి 153 అడుగుల ఎత్తులో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. బాపు బొమ్మను ప్రతిష్ఠించే పీఠం ఎత్తు 100 మీటర్ల వరకూ ఉండనుంది. దీంతోపాటు.. గాంధీ సిద్ధాంతాలు, జీవిత విశేషాలను తెలిపే మ్యూజియం, ధ్యాన గ్రామం, చేనేత శిక్షణ కేంద్రం, లండన్‌ఐ తరహాలో చరఖా వంటివాటిని ప్రధాన ఆకర్షణగా ఏర్పాటు చేయనున్నారు. సందర్శకులను ఆకట్టుకునేలా వీల్ ఆఫ్ లైఫ్ పేరుతో నిర్మాణాలు చేపట్టనున్నారు. సుందరమైన పార్కులు ఏర్పాటు చేసి.. వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లను, బోటింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తేనున్నారు. మూసీ, ఈసీ నదులు సంగమించే ఈ ప్రాంతంలో గాంధీ అస్థికలను కలిపిన చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. కాగా.. ఈ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములను వినియోగించుకోవడానికి అనుమతిచ్చిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మూసీ పునరుజ్జీవంతోపాటు.. ఆ నదీ తీరాన్ని పర్యావరణ, సాంస్కృతిక, ప్రజాప్రయోగ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజన్‌లో కేంద్ర రక్షణ శాఖ ఇచ్చిన అనుమతి కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రజాస్థలాలు, సాంస్కృతిక కేంద్రాలు, పర్యాటక ఆకర్షణలు అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు.
ఎంఆర్‌డీసీఎల్ డైరెక్టర్‌గా హరినాథ్ రెడ్డి
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక బదిలీ జరిగింది. అగ్నిమాపక శాఖలో రీజనల్ ఫైర్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న బి. హరినాథ్ రెడ్డిని.. మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్ కో-ఆర్డినేషన్)గా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ఏడాది పాటు ఈ పోస్టులో కొనసాగుతారు. ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గతంలో హెచ్‌ఎండీఏలో సీఐవో, ఓఎస్డీగా బాధ్యతలు చేపట్టిన హరినాథ్‌రెడ్డి.. హైదరాబాద్‌కు ప్రతిష్ఠాత్మక ‘గ్రీన్ సిటీ’ అవార్డు రావడంలో కీలకంగా వ్యవహరించారు.