రూ. 5,681 కోట్ల యూసీఎఫ్ ప్రాజెక్టులకు ఓకే!
ABN , Publish Date - May 22 , 2026 | 04:01 AM
తెలంగాణలోని మూడు పట్టణాల్లో ‘అర్బన్ సెక్టార్ డెవల్‌పమెంట్ ఫండ్ (యూసీఎఫ్)’ కింద రూ.5,681 కోట్లతో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది.
తెలంగాణలోని మూడు నగరాల్లో చేపట్టేందుకు కేంద్రం ఆమోదం
కేంద్ర వాటా 1,420 కోట్లు విడుదల
రాష్ట్ర వాటా మరో 1,420 కోట్లు
మిగతా సొమ్ము హడ్కో నుంచి రుణం
కరీంనగర్‌కు ప్రాజెక్టు సాధించుకున్న బండి సంజయ్
హైదరాబాద్, మే 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని మూడు పట్టణాల్లో ‘అర్బన్ సెక్టార్ డెవల్‌పమెంట్ ఫండ్ (యూసీఎఫ్)’ కింద రూ.5,681 కోట్లతో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. అందులో వరంగల్‌లో మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణకు రూ.4,674 కోట్లు, కరీంనగర్‌లో మౌలిక వసతుల (జంక్షన్ల అభివృద్ధి, స్కైవాక్‌లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జీలు వంటివి) కల్పనకు రూ.840 కోట్లు, ఖమ్మం-వరంగల్-కరీంనగర్ కారిడార్‌లో డిజిటల్ గవర్నెన్స్ కోసం రూ.166 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల వ్యయంలో కేంద్ర, రాష్ట్రాలు 25శాతం చొప్పున వాటాగా భరిస్తాయి. మిగతా 50శాతం నిధులను హడ్కో నుంచి రుణాల రూపంలో కేంద్రం సమకూరుస్తుంది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి హీరాలాల్ మిశ్రా గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక లేఖ పంపారు. కేంద్రం వాటా రూ.1,420.26 కోట్ల నిధులను విడుదల చేసినట్టు వెల్లడించారు. మొత్తంగా దేశవ్యాప్తంగా రూ.14,867.88 కోట్ల విలువైన 17 యూసీఎఫ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలపగా.. అందులో రూ.5,681 కోట్ల విలువైన ప్రాజెక్టులు తెలంగాణలో ఉండటం గమనార్హం. నిజానికి తొలుత రాష్ట్ర ప్రభుత్వం పంపిన యూసీఎఫ్ జాబితాలో కరీంనగర్ ప్రాజెక్టు లేదు. మిగతా రెండు ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లను మాత్రమే కేంద్రానికి పంపారు. అయితే కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.. పట్టుబట్టి కరీంనగర్ ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్రానికి అందేలా చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్‌లాల్ కట్టార్‌లను కలిసి ఈ ప్రాజెక్టును ఆమోదించాలని కోరారు.