ఈశాన్య రాష్ట్రాలకు బడ్జెట్‌లో 10శాతం నిధులు
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:47 AM
ఈశాన్య రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా కేంద్ర బడ్జెట్‌లో 10 శాతం నిధులను ఈ ప్రాంతం కోసమే కేటాయిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వెల్లడించారు.
మిజోరాం ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి సంజయ్ సమీక్ష
హైదరాబాద్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ఈశాన్య రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా కేంద్ర బడ్జెట్‌లో 10 శాతం నిధులను ఈ ప్రాంతం కోసమే కేటాయిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వెల్లడించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం మిజోరాం చేరుకున్న ఆయన, సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల నుంచి మన దేశంలోకి డ్రగ్స్, అక్రమ ఆయుధాల సరఫరా జరుగుతున్నట్లు సమాచారం ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దేశ భద్రత దృష్ట్యా అక్రమ రవాణాపై మిజోరాం ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని, సరిహద్దుల వద్ద నిఘాను కట్టుదిట్టం చేయాలని డీజీపీ సహా ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో రోడ్డు, రైల్వే, ఎయిర్, టెలికమ్యూనికేషన్ రంగాల్లో మెరుగైన కనెక్టివిటీ కల్పించేందుకు శాస్త్రీయమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి బండి సంజయ్ సూచించారు.