రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పెద్దపీట
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:31 AM
గడచిన 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం, తెలంగాణకు పన్నుల వాటా రూపంలో రూ.1.18 లక్షల కోట్లు కేటాయించిందని బీజేపీ ఎంపీ, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు.
పన్నుల వాటా రూపంలో రూ.1.18 లక్షల కోట్ల కేటాయింపు
మీడియాతో ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్
హైదరాబాద్,జూన్ 14 (ఆంధ్రజ్యోతి): గడచిన 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం, తెలంగాణకు పన్నుల వాటా రూపంలో రూ.1.18 లక్షల కోట్లు కేటాయించిందని బీజేపీ ఎంపీ, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా మరో రూ. లక్ష కోట్లు అందించిందని చెప్పారు. రాష్ట్రంలో రూ. 31వేల కోట్లతో సుమారు 5 వేల కి.మీ.ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని తెలిపారు. భారత్ మాల కింద రూ. 38 వేల కోట్లతో (సూరత్-చెన్నై, హైదరాబాద్-ఇండోర్, హైదరాబాద్-పనాజీ) ఎకనామిక్ కారిడార్‌ను కేంద్రం మంజూరు చేసిందని లక్ష్మణ్ వివరించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ ఎన్నికల్లో సీటు చోరీ అంటూ కాంగ్రెస్ నాయకులు బీజేపీపై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు అని లక్ష్మణ్ విమర్శించారు. ‘మోదీ 12 ఏళ్ల పాలనలో దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. జన్‌ధన్, ఉజ్వల, ముద్ర వంటి పథకాలు కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపాయి. మౌలిక రంగాల అభివృద్ధికి బడ్జెట్‌ను రూ. 2లక్షల కోట్ల నుంచి రూ. 12లక్షల కోట్లకు పెంచారు. 81 కోట్ల మందికి మోదీ ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తోంది’ అని లక్ష్మణ్ వివరించారు. డీలిమిటేషన్‌లో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణాలో కాంగ్రె్‌సకు రేవంత్ చివరి ముఖ్యమంత్రి అని, ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.