పంచాయతీలకు నిధులొచ్చాయ్
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:19 AM
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద కేంద్రం నుంచి రావాల్సి ఉన్న మరికొన్ని నిధులు వచ్చాయి. తాజాగా మంగళవారం రూ.619.85 కోట్లను కేంద్రం విడుదల చేసింది.
రూ.619.85 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద మంజూరు
ఇప్పటివరకు విడతలవారీగా రూ.2,293.74 కోట్లు జమ
త్వరలో మిగతా రూ.729.41 కోట్ల బకాయిలు వచ్చే చాన్స్
హైదరాబాద్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద కేంద్రం నుంచి రావాల్సి ఉన్న మరికొన్ని నిధులు వచ్చాయి. తాజాగా మంగళవారం రూ.619.85 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇందులో టైడ్ గ్రాంట్స్ కింద రూ.371.91 కోట్లు, అన్‌టైడ్ గ్రాంట్స్ కింద రూ.247.94 కోట్లు విడుదలయ్యాయి. టైడ్‌గ్రాంట్స్‌ను గ్రామాల్లో పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరాకు అవసరమైన పనుల కోసం, అన్‌టైడ్ గ్రాంట్స్‌ను గ్రామాల్లో ఇతర ఏ అభివృద్ధి పనులకైనా ఉపయోగించవచ్చు. పాలక వర్గాల్లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు చెల్లించే 15వ ఆర్థిక సంఘం నిధులను పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రతిపాదన మేరకు కేంద్ర ఆర్థిక శాఖ పాత బకాయిలను చెల్లించడం మొదలుపెట్టింది. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు రూ.3,023.15 కోట్ల నిధులు రావాల్సి ఉండగా... కేంద్రం రెండు నెలలుగా ఈ నిధులను విడుదల చేస్తోంది. రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీలకు మార్చి 31నాటికి బకాయి నిధులను చెల్లించాల్సి ఉండగా.. కేంద్ర ఆర్థికశాఖ ఫిబ్రవరి 5న రూ.259.36 కోట్లు, 12న రూ.387కోట్లు 20న రూ.387.53 కోట్లు, మార్చి 13న 640 కోట్లు, తాజాగా రూ.619.85 కోట్లు విడుదల చేసింది. వీటితో విడుదల చేసిన మొత్తం నిధులు రూ.2,293.74 కోట్లుగా ఉన్నాయి. రాష్ట్రానికి ఇంకా రూ.729.41కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. కేంద్రం ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులకు సంబంధించిన యూసీ (నిధుల వినియోగ బిల్లులు)లను సమర్పించామని, ఈ మేరకు మిగిలిన బకాయి నిధులను కూడా కేంద్ర ఆర్థికశాఖ త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు చెబుతున్నారు.
పాత, కొత్త సర్పంచ్‌ల మధ్య వివాదం
కేంద్రం పంచాయతీలకు బకాయి నిధులను విడుదల చేయడం వల్ల ఊరట లభిస్తోంది. అయితే రెండేళ్ల తర్వాత విడుదలైన ఈ నిధుల వినియోగం విషయంలో పాత, కొత్త సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల మధ్య వివాదం కొనసాగుతోంది. నిధుల వినియోగంపై స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు. ప్రస్తుతం విడుదలైన నిధులను పాత బిల్లుల చెల్లింపులకు కూడా వాడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే కొత్త సర్పంచ్‌లు (ప్రత్యేక అధికారులు/వార్డు సభ్యుల కమిటీలు) ఆ నిధులను పాత పనులకు కాకుండా కొత్త పనులకే కేటాయిస్తామని పట్టుబడుతుండటంతో వివాదం కొనసాగుతోంది. కొన్నిచోట్ల మాత్రం ఏ సమస్యలేకుండా బకాయి నిధులను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. మరికొన్ని చోట్ల ఎంబీ రికార్డులు లేకపోవడం, ఇతర కారణాలతో బకాయి చెల్లింపులకు ఆటంకం ఏర్పడుతోంది.