Share News

3 నెలల రేషన్‌ ఒకేసారి.. !

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:08 AM

వచ్చే మూడు నెలల(ఏప్రిల్‌, మే, జూన్‌) కోటా రేషన్‌ బియ్యాన్ని ఒకేసారి ఏప్రిల్‌లోనే పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

3 నెలల రేషన్‌ ఒకేసారి.. !

  • ఏప్రిల్‌లోనే పంపిణీకి కేంద్రం నిర్ణయం

  • గోదాముల్లో నిల్వలు ఖాళీ చేసేందుకు కసరత్తు

హైదరాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): వచ్చే మూడు నెలల(ఏప్రిల్‌, మే, జూన్‌) కోటా రేషన్‌ బియ్యాన్ని ఒకేసారి ఏప్రిల్‌లోనే పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు గత సీజన్లకు సంబంధించిన ధాన్యం నిల్వలు, మరోవైపు మిల్లింగ్‌ పూర్తయి వస్తున్న కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌తో గోదాముల్లో బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో నిల్వలను త్వరితగతిన పూర్తిచేసేందుకు కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గోదాముల నుంచి రేషన్‌ షాపులకు బియ్యాన్ని తరలించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ప్రతి లబ్ధిదారునికి నెలకు 6కిలోల బియ్యం ఇస్తున్నారు. మూడు నెలల కోటా ఒకేసారి ఇస్తుండడంతో ఒక కుటుంబంలో నలుగురు సభ్యులుంటే 72 కిలోలు, ఐదుగురు సభ్యులుంటే 90 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.05కోట్ల రేషన్‌ కార్డులుండగా.. వాటిపై 3.40కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. కేంద్రప్రభుత్వ తాజా ఆదేశాల మేరకు.. సుమారు 6లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీకి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 3నెలల కోటాను ఒకేసారి ఇవ్వడం వల్ల సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులు ఒకేసారి వేలిముద్ర వేస్తే 3నెలల కోటా డ్రా అవుతుందా? లేక మూడుసార్లు వేయాలా? అనే అంశంపై కసరత్తు జరుగుతోంది. ఏప్రిల్‌ ఒకటి నాటికి సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ పూర్తి చేసి పంపిణీ ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ(భారత ఆహార సంస్థ) వద్ద భారీగా బియ్యం నిల్వలు ఉండడంతో.. కొత్తగా వచ్చే ధాన్యానికి చోటు లేకుండా పోయింది. గత ఖరీఫ్‌, యాసంగి సీజన్లలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) రూపంలో భారీగా గోదాములకు చేరుతోంది. ప్రస్తుతం యాసంగి సీజన్‌ ధాన్యం సేకరణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గోదాములను కొంతవరకైనా ఖాళీ చేసేందుకు కేంద్రం 3 నెలల రేషన్‌ ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది.

Updated Date - Mar 28 , 2026 | 05:08 AM