Share News

నీటి వాటాలు తేలేదాకా పరిశీలించలేం

ABN , Publish Date - Feb 01 , 2026 | 06:23 AM

కృష్ణా జలాల పంపిణీ కోసం జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌లో విచారణ జరుగుతున్నందున పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను ఇప్పట్లో పరిశీలించలేమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

నీటి వాటాలు తేలేదాకా పరిశీలించలేం

  • పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌పై కేంద్రం

  • ట్రైబ్యునల్‌లో విచారణ పూర్తయ్యేదాకా ఆగాల్సిందే

  • సమ్మక్కసాగర్‌ డీపీఆర్‌ సీడబ్ల్యూసీ పరిధిలో ఉంది

  • ఉత్తమ్‌కు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ లేఖ

  • టెలిమెట్రీలపై తదుపరి బోర్డు సమావేశంలో నిర్ణయం

  • తీసుకోవాలని కేఆర్‌ఎంబీని ఆదేశించినట్లు వెల్లడి

హైదరాబాద్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల పంపిణీ కోసం జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌లో విచారణ జరుగుతున్నందున పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను ఇప్పట్లో పరిశీలించలేమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున డీపీఆర్‌ పరిశీలనలో ముందుకెళ్లలేమని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఈ నెల 29న లేఖ రాశారు. కృష్ణా, గోదావరి బేసిన్‌ పరిధిలో పలు సమస్యలను లేవనెత్తుతూ వాటిని పరిష్కరించాలని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను ఆమోదించాలని కోరుతూ మంత్రి ఉత్తమ్‌ గతేడాది జూలై 14న, నవంబరు 18న రాసిన లేఖలకు బదులిస్తూ ఈ లేఖ రాశారు. నీటి పంపిణీ అంశం కోర్టు పరిధిలో ఉన్నందువల్లే పాలమూరు డీపీఆర్‌ను వెనక్కి పంపించామని తెలిపారు. ఇక సమ్మక్కసాగర్‌ (తుపాకులగూడెం) బ్యారేజీ డీపీఆర్‌ కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. దీనిపై కొన్ని అనుమానాలు నివృత్తి చేయాల్సిందిగా తెలంగాణకు సీడబ్ల్యూసీ లేఖ రాసిందని గుర్తుచేశారు.

కేంద్ర మంత్రి రాసిన లేఖలోని అంశాలు...

  • రాష్ట్రాల వారీగా నీటి పంపిణీపై విచారణ చేసి పంపకాలు చేయడానికి బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు ఈ ఏడాది జూలై 31 వరకు అవకాశమిచ్చాం. తెలంగాణ తన వాదనలు వినిపించింది.

  • పోలవరం -బనకచర్ల ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎ్‌ఫఆర్‌)ను ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి అందించగా.. దానిపై అభిప్రాయాలు తెలపాలని కృష్ణా/గోదావరి బోర్డులతోపాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి, గోదావరి నదిని పంచుకునే రాష్ట్రాలకు పంపించాం. ఆయా రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలను సీడబ్ల్యూసీ పరిశీలిస్తోంది.

  • ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచకుండా కట్టడి చేయాలని తెలంగాణ కోరింది. అయితే ఆ డ్యామ్‌ను 519.6 మీటర్ల పూర్తిస్థాయి రిజర్వాయర్‌ లెవల్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌)లో నిర్వహిస్తున్నామని కర్ణాటక ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.


  • 2026-31 కుగాను ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజనకింద అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి, మక్తల్‌ -నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు సహాయం చేయాలని తెలంగాణ లేఖ రాసింది. ఈ ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ ఇప్పటిదాకా ఎటువంటి క్లియరెన్స్‌ ఇవ్వలేదు. ఇక సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టు, ముక్తేశ్వరం, మొడికుంట వాగు, చనాకా-కొరాటా డిస్ట్రిబ్యూటరీలకు సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌ ఉంది. వీటిపై మరిన్ని వివరాల కోసం సంబంధిత ప్రాజె క్టు చీఫ్‌ ఇంజనీర్లకు పంపించాం.

  • గోదావ రి-కావేరి అనుసంధానం ప్రాజెక్టుతో బచావత్‌ ట్రైబ్యునల్‌ నీటి పంపకాలకు అదనంగా నీటి వినియోగానికి తెలంగాణకు అవకాశం లభిస్తుంది. ఇంద్రావతి నదిలో ఛత్తీ్‌సగఢ్‌ వినియోగించుకోని వాటాను తొలిదశలో ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్‌ నిర్మించి, గోదావరి-కావేరి అనుసంధానంలో తరలించాలన్న నిర్ణయం జరిగింది. మలిదశలో హిమాలయన్‌ కాంపోనెంట్‌ నుంచి తరలించే నీటినే గోదావరి-కావేరిలో తరలిస్తారు. తొలిదశలో మధ్యంతర ఏర్పాట్లలో భాగంగానే నీటిని తరలిస్తున్నాం. తెలంగాణకు ఈ ప్రాజెక్టుతో అదనంగా నీటిని వినియోగించుకోవడానికి అవకాశం కలగనుంది.

  • కేటాయించిన కోటా నుంచే 10 టీఎంసీల జలాలను కడప-కర్నూలు హైలెవల్‌/లో లెవల్‌ కెనాల్‌ల నుంచి ఏపీ తరలిస్తుందని తుంగభద్ర బోర్డు సమాచారమిచ్చింది. గోదావరి/కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులను.. నిర్వహణ కోసం బోర్డుకు అప్పగించాలని కేంద్రం గెజిట్‌ జారీ చేసినా ఇంకా అప్పగించలేదని ఆయా బోర్డులు సమాచారమిచ్చాయి. రెండో,మూడో దశ టెలిమెట్రీల ఏర్పాటుపై రానున్న బోర్డు భేటీలో చర్చించి, నిర్ణయం తీసుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఆదేశాలిచ్చాం.

Updated Date - Feb 01 , 2026 | 06:24 AM