Share News

రాష్ట్రంలో 15 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు రద్దు!

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:53 AM

కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త ఈఎ్‌సఐ డిస్పెన్సరీల ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

రాష్ట్రంలో 15 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు రద్దు!

  • తెలంగాణలో 15, ఏపీలో 17 డిస్పెన్సరీలకు ఎనిమిదేళ్ల క్రితమే కేంద్రం అనుమతులు

  • వైద్యుల్లేక అందుబాటులోకి రాని వైద్యం

  • ఆస్పత్రుల నిర్వహణలోనూ రాష్ట్రాల నిర్లక్ష్యం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త ఈఎ్‌సఐ డిస్పెన్సరీల ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన 88 ఈఎ్‌సఐ డిస్పెన్సరీల తాత్కాలిక ఆమోదాన్ని రద్దు చేస్తూ ఎంప్లాయీస్‌ ేస్టట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎ్‌సఐ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈఎ్‌సఐ హెడ్‌ క్వార్టర్స్‌ ఓఎస్డీ (మెడికల్‌ సర్వీసెస్‌) అనుపమ్‌ ముర్ము తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 32 డిస్పెన్సరీలు ఉన్నాయి. తెలంగాణలో 15, ఏపీలో 17 ఈఎ్‌సఐ డిస్పెన్సరీలను కేంద్రం రద్దు చేసింది. 2016 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 152 ఈఎ్‌సఐ డిస్పెన్సరీలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, వీటిలో చాలా డిస్పెన్సరీలు ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. స్థల ేసకరణ, భవనాల నిర్మాణంలో జాప్యం, సిబ్బంది నియామకాల్లో నిర్లక్ష్యం వెరసి ఈ ప్రాజెక్టులు అటకెక్కాయి. కేంద్రం పలుమార్లు రాష్ట్రాలను హెచ్చరించినప్పటికీ ఉపయోగం లేకుండాపోయింది. ఈ ఏడాది జనవరిలో రీజినల్‌ డైరెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 15 రోజుల్లోగా కార్యాచరణ మొదలుపెట్టాలని, లేదంటే అనుమతులు రద్దు చేస్తామని డెడ్‌ లైన్‌ విధించింది. ఆ గడువు ముగిసినా మార్పు రాకపోవడంతో, మూడేళ్ల కంటే ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉన్న 88 డిస్పెన్సరీల అనుమతులను తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.


డాక్టర్ల కొరత, నిర్వహణ లోపం

తెలంగాణ పరిధిలో 2018 సంవత్సరం ఫిబ్రవరిలో ఆరింటికి, ఏప్రిల్‌ నెల్లో మరో ఐదింటికి, ఆగస్టు మాసంలో మరో నాలుగింటికి కలిపి మొత్తం 15 ఈఎ్‌సఐ డిస్పెన్సరీల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. డాక్టర్ల కొరత, సిబ్బంది లేకపోవడంతో 15 డిస్పెన్సరీల నిర్వహణలో ప్రతిష్టంభన ఏర్పడింది. మంజూరైన ప్రతి డిస్పెన్సరీకి కనీసం ఒకరు, ఇద్దరు డాక్టర్లు ఉండాలి, కానీ నియామకాలు చేపట్టకపోవడంతో వైద్యులు కనిపించని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు అతిపెద్ద సమస్య నిధుల కొరత. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన వాటా నిధులు సకాలంలో జమ చేయలేదు. సొంత భవనాలు లేక చాలా చోట్ల అద్దె భవనాల్లో నామమాత్రంగా నడుస్తున్న డిస్పెన్సరీల్లో కనీస వసతులు లేవు. వీటి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రతిపాదనలు కూడా పంపలేదని సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఈ డిస్పెన్సరీల మంజూరు అనుమతులను రద్దు చేసింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డాక్టర్లను నియమించి, మంజూరైన 15 డిస్పెన్సరీలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఏపీలో రద్దయినవి..

తిరుమల, అనకాపల్లి, నక్కపల్లి, శ్రీకాకుళంసిటీ, విజయనగరంసిటీ, నాయుడుపేట, సత్యవేడు, పూతలపట్టు, వరదయ్యపాలెం,కంచికచర్ల, చిల్కూరు, తుని, ఎచ్చెర్ల, అప్పన్నవీడు, ముత్కూరు, పరవాడ, ముదినేపల్లి.

తెలంగాణలో రద్దయినవి..

మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌, సిద్దిపేట, వికారాబాద్‌ జిల్లా తాండూరు, మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లా కేటీటీపీ చెల్పూర్‌, మంచిర్యాల జిల్లా జైపూర్‌, ఖమ్మం జిల్లా ముదిగొండ, ఆదిలాబాద్‌, హన్మకొండ జిల్లా ధర్మాసాగర్‌, వరంగల్‌ జిల్లా గీసుగొండ, సూర్యాపేట, సూర్యాపేట జిల్లా కోదాడ, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, హన్మకొండ జిల్లా ధర్మాసాగర్‌ మండలం.

Updated Date - Feb 23 , 2026 | 02:53 AM