Land Registration Scam: ‘భూ భారతి’ దిద్దుబాటు
ABN , Publish Date - Jan 14 , 2026 | 06:42 AM
ధరణి నుంచి భూ భారతి పోర్టల్ వరకు జరిగిన అక్రమాలపై సీసీఎల్‌ఏ అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.
పోర్టల్‌లో మార్పులు చేసిన సీసీఎల్‌ఏ
ఎడిట్ చేయకుండా ఉండేలా మార్పులు
సెక్యూరిటీ చెక్, పేమెంట్ ఇంటర్‌ఫేస్ అప్‌డేట్
డాక్యుమెంట్ల పరిశీలన తహసీల్దార్లకు..
17లోగా నివేదిక అందించాలని ఆదేశాలు
అధికారుల పాత్రపై అనుమానాలు?
రైతులకు రెవెన్యూ అధికారుల నోటీసులు
దొంగల్ని తేల్చాలంటే వివరాలివ్వాలని ఆదేశం
అవకతవకలపై తహసీల్దార్ల ఫిర్యాదులు
యాదాద్రి జిల్లాలో 45 మందిపై కేసులు
జనగామ/హైదరాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ధరణి నుంచి భూ భారతి పోర్టల్ వరకు జరిగిన అక్రమాలపై సీసీఎల్‌ఏ అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. కుంభకోణంపై ఓ వైపు పోలీసులు, సీసీఎల్‌ఏ విజిలెన్స్ విభాగం విచారణ చేస్తుండగా.. మరోవైపు తప్పిదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుత భూ భారతి గానీ, అప్పటి ధరణిలో గానీ స్లాట్ బుకింగ్ ప్రక్రియ అంతా బాగానే జరిగినా.. పేమెంట్ ఇంటర్‌ఫేస్ పేజీకి రాగానే థర్డ్ పార్టీ గేట్‌వే ద్వారా చెల్లింపులు చేసి స్టాంపు డ్యూటీని దారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పోర్టల్‌లో పేమెంట్ ఇంటర్‌ఫేస్ వ్యవస్థను బలోపేతం చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు సెక్యూరిటీ చెక్ విధానాన్ని కూడా తీసుకువచ్చినట్లు సమాచారం. దీనివల్ల పేమెంట్‌ను దారి మళ్లించే ఆస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా సబ్ రిజిస్ట్రార్ వ్యవస్థలో ఉన్న డెఫిసిట్ విధానాన్ని పోర్టల్‌లో పొందుపరచాలని సీసీఎల్‌ఏ అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల జరగాల్సిన పేమెంట్ కంటే ఒక్క రూపాయి తక్కువగా జమ చేసినా తహసీల్దార్ గుర్తించి రిజిస్ట్రేషన్‌ను ఆపే అవకాశం ఉంటుంది. మరోవైపు ధరణి నుంచి భూ భారతి వరకు జరిగిన డాక్యుమెంట్ల పరిశీలనకు సీసీఎల్‌ఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం రాత్రి ఆదేశాలు ఇవ్వగా ఆయా జిల్లాల కలెక్టర్లు తహసీల్దార్లతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అవకతవకలు జరిగిన డాక్యుమెంట్లను తిరిగి పరిశీలించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా సీసీఎల్‌ఏ నుంచి వచ్చిన డాక్యుమెంట్లను పరిశీలించి ఈ నెల 17లోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలుస్తోంది.
కలెక్టర్ల ఆదేశాలతో తహసీల్దార్లు డాక్యుమెంట్ల పరిశీలన ప్రక్రియ పనిలో నిమగ్నమయ్యారు. అవకతవకలు జరిగిన డాక్యుమెంట్లకు సంబంధించి జనగామ జిల్లావ్యాప్తంగా 80 మందికి పైగా నోటీసులు అందించినట్లు సమాచారం. వీరిలో రైతులకు కూడా నోటీసులు ఇవ్వడం వివాదాస్పదమైంది. కొంత మంది రైతులు నోటీసులు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. అయితే దీనిపై రెవెన్యూ శాఖ స్పష్టత ఇస్తోంది. భూమి కొనుగోలు చేసిన వ్యక్తి.. రిజిస్ట్రేషన్ సమయంలో తాను ఎంత చెల్లించారు? ఎవరికి చెల్లించారు? అనే వివరాలు అందజేస్తే.. ఆ వివరాల ఆధారంగా అసలైన అక్రమార్కులు ఎవరనేది తేలుతుందని, ఇందులో రైతులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెబుతోంది. రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులు వివరాలు చెప్పకపోతే.. చట్టపరంగా తగ్గిన మొత్తం వారినుంచే రికవరీ చేయాల్సి వస్తుందని అంటున్నారు.
అధికారుల పాత్రపై ఆరా!
భూభారతి కుంభకోణంలో అధికారుల పాత్రపై కూడా విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతున్నా తహసీల్దార్లు ఎందుకు గుర్తించలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటి వరకు 20 మందికి పైగా మీసేవా కేంద్రాలు, స్లాట్ బుకింగ్ కేంద్రాల నిర్వాహకులను విచారించినట్లు తెలిసింది. విచారణలో భాగంగా తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. యాదాద్రి జిల్లా నుంచి మహబూబ్‌నగర్ జిల్లా వరకు లింక్ ఏర్పడిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భూభారతి స్కామ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ విచారణను వేగవంతం చేసింది. కమిటీలో ఒకరైన ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సింధుశర్మ మంగళవారం జనగామకు వచ్చారు. జనగామ డీసీపీ, విచారణలో భాగస్వాములైన పోలీసులతో ఆమె సమావేశమయ్యారు.
విచారణ ఏ కోణంలో చేద్దాం!
భూ భారతి చలానాల కుంభకోణంపై విచారణకు ఏర్పాటైన కమిటీ తొలి సమావేశాన్ని మంగళవారం మధ్యాహ్నం నిర్వహించింది. ఆన్‌లైన్ ద్వారా కమిటీ సభ్యులు.. సీసీఎల్‌ఏ కార్యదర్శి మకరంద్, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ (సాంకేతిక విభాగం) సుభాషిణి, పోలీసు అధికారులు సింధుశర్మ, శరత్, సంపత్ సమావేశమయ్యారు. విచారణకు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనే దానిపై చర్చించారు. తొలుత చలానా మోసాలపై ఏ కోణంలో విచారణ చేపడదామనే అంశంపై చర్చ జరిగింది. సాంకేతిక పరంగా ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని చలానా మొత్తాన్ని దారి మళ్లించిన కేసుల్లో ఎవరి ప్రమేయం ఉంది, ఎలా చేయగలిగారనే దానిపై రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ సుభాషిణి నుంచి పలు వివరాలు సేకరించారు. ఒక్క చలానాలే కాకుండా గిఫ్ట్ డీడ్స్, జీపీఏ, లీజు అగ్రిమెంట్లు, డెవల్‌పమెంట్, మార్ట్‌గేజ్ తదితర రిజిస్ట్రేషన్ల వివరాలపై లోతైన విచారణ చేయాలని కమిటీ భావించినట్లు తెలిసింది. ఇందుకోసం అవసరమైన సమాచారాన్ని జిల్లాల వారీగా సమకూర్చాలని భూ భారతి పోర్టల్‌ను నిర్వహిస్తున్న నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్‌ఐసీ) అధికారులను ఆదేశించారు. సంక్రాంతి తరువాత ఈ నెల 19 నుంచి అంశాల వారీగా విచారణ చేయాలని కమిటీ నిర్ణయించింది. నల్లగొండ జిల్లాలో 161 కేసుల్లో చలానా మొత్తం తగ్గినట్లు జిల్లాకు పంపిన నివేదికలో గుర్తించారు. అయితే అధికారుల విచారణలో 12 కేసుల్లో చలానా మొత్తం తగ్గినట్లు తేలింది.