PLGA Commander Bhadse Deva: నేటి పరిస్థితికి కేంద్ర కమిటీ వైఫల్యమే కారణం
ABN , Publish Date - Jan 07 , 2026 | 04:11 AM
మావోయిస్టు పార్టీ ప్రస్తుత పరిస్థితికి సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్ర కమిటీ వైఫల్యమే అంతిమ కారణంగా తాను భావిస్తున్నానని తెలంగాణ పోలీసుల ముందు ఇటీవల లొంగిపోయిన పీఎల్‌జీఏ కమాండర్ బడ్సే దేవా ....
సరైన నిర్ణయాలు తీసుకోలేదు
గణపతి, తిరుపతి.. ఎక్కడున్నారో తెలియదు
నేను లొంగిపోలేదు.. పట్టుకున్నారు
‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో పీఎల్‌జీఏ కమాండర్ బడ్సే దేవా
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ ప్రస్తుత పరిస్థితికి సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్ర కమిటీ వైఫల్యమే అంతిమ కారణంగా తాను భావిస్తున్నానని తెలంగాణ పోలీసుల ముందు ఇటీవల లొంగిపోయిన పీఎల్‌జీఏ కమాండర్ బడ్సే దేవా వ్యాఖ్యానించారు. ‘‘ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రం భీకరమైన పోరాటం ప్రారంభించిన తర్వాత తదుపరి ఏం చేయాలన్న విషయమై పార్టీలో వివిధ స్థాయుల్లో చర్చ జరిగింది. ఆపరేషన్ కగార్‌తో ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు పెరిగాయి. నేటి పరిస్థితికి అదొక కారణం. ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లడంతో పార్టీ కేంద్ర కమిటీ విఫలమైందని నేను భావిస్తున్నాను’’ అని ఆయన చెప్పారు. ఇటీవల లొంగిపోయిన ఆయన ‘ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి’కి సోమవారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన గణపతి, దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతిని తానీ మధ్య కలవలేదని, వారెక్కడ ఉన్నారో కూడా తనకు తెలియదని తెలిపారు. మావోయిస్టు పార్టీలో బతికి ఉన్న వారు తమ నిర్ణయం తాము తీసుకుంటారని, ఆశన్న, సోనూ లొంగుబాటుపై తానేమీ మాట్లాడనన్నారు. తాను 23 ఏళ్ల కిందట మావోయిస్టు పార్టీలో చేరినప్పటి నుంచి జరిగిన పరిణామాలపై ఆయన స్పందించారు. ‘‘మావోయిస్టు పార్టీలోకి నన్నెవ్వరూ తీసుకుని రాలేదు. నేనే స్వయంగా వచ్చాను. హిడ్మాది, నాది ఒకటే గ్రామం. కాబట్టి చిన్ననాటి నుంచి పరిచయస్తులం. నేను పార్టీలో చేరిన తర్వాత వివిధ హోదాల్లో పనిచేసి.. చివరకు పీఎల్‌జీఏ కమాండర్ అయ్యాను. గత ఏడాది అక్టోబరు 27వ తేదీ వరకు నేను, హిడ్మా, ఇతర దళ సభ్యులు తెలంగాణ, చత్తీ్‌సగఢ్ సరిహద్దుల్లోనే ఉన్నాం. తర్వాత హిడ్మా వేరే పనిమీద వెళ్లిపోయారు. కొన్నాళ్లకు హిడ్మా మరణ వార్తను రేడియో, పత్రికల ద్వారా తెలుసుకున్నాను’’ అని దేవా తెలిపారు. హిడ్మా ఎందుకు వెళ్లాడు? ఎక్కడ పోలీసులకు పట్టుబడ్డాడు? అన్నది తెలియదని చెప్పారు. ‘‘నేను ఓ పనిమీద వాహనంలో వెళ్తున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత పరిస్థితులను పోలీసులు వివరించడంతో నేను మనసు మార్చుకుని లొంగిపోయాను’’ అని వివరించారు. తన వద్ద ఉన్న డైరీలో డంప్‌కు సంబంధించిన సమాచారం ఉందని, దాని ఆధారంగానే టవర్, తదితర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. టవర్ ఆయుధాన్ని 2014లో పోలీసులపై జరిగిన దాడిలో తాము స్వాధీనం చేసుకున్నామని, హెలికాప్టర్ షాట్స్ తమ టెక్నికల్ టీం తయారు చేసిందని, వాటిని తానెప్పుడు వాడలేదని స్పష్టం చేశారు. తన లొంగుబాటు గురించి పార్టీకి సమాచారం ఇవ్వలేకపోయానని అంగీకరించారు.