Share News

అరవింద్‌కుమార్‌ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం ఓకే

ABN , Publish Date - Feb 15 , 2026 | 05:40 AM

ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించి నిధుల దుర్వినియోగం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

అరవింద్‌కుమార్‌ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం ఓకే

  • ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం

  • సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి

  • మరోసారి నోటీసులు ఇచ్చి, ప్రశ్నించనున్న ఏసీబీ

  • ఆ తర్వాత కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసే చాన్స్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించి నిధుల దుర్వినియోగం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్‌ ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతించినట్లు తెలిసింది. 2023లో ఫార్ములా-ఈ కారు రేసు నిర్వహణ సందర్భంగా చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి నమోదైన కేసులో అరవింద్‌ కుమార్‌పై చట్టపరమైన చర్యలకు అనుమతించాలని కోరుతూ గతంలోనే కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ(డీవోపీటీ)కి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. ఈ అభ్యర్ధనను పరిశీలించిన కేంద్రం.. విచారణకు అనుమతిస్తూ తాజాగా లేఖ పంపినట్లు సమాచారం. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్‌, ఏ2గా సీనియర్‌ ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌, మరి కొందరు నిందితులుగా ఉన్నారు. అప్పట్లో హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఉన్న అరవింద్‌ కుమార్‌ ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహణలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. క్యాబినెట్‌, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో విదేశీ సంస్థలకు రూ.55కోట్లను చెల్లించారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు ఇప్పటికే అరవింద్‌ కుమార్‌ను పలు మార్లు ప్రశ్నించారు. నాటి మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకే నిధులు విడుదల చేశామని, హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే అలా చేయాల్సి వచ్చిందని ఆయన దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది.


ఈ కేసులో మనీలాండరింగ్‌, ఫెమా ఉల్లంఘనలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సైతం విచారణ జరుపుతోంది. గత ఏడాది నవంబరు 20వ తేదీనే కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతించారు. తాజాగా ఇప్పుడు అరవింద్‌ కుమార్‌ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి రావడంతో మరో సారి నోటీసులు జారీ చేసి, విచారణ చేపట్టేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఆ వెంటనే కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Feb 15 , 2026 | 05:41 AM