Share News

తెలుగు రాదాయె.. యాప్‌ వినదాయె!

ABN , Publish Date - May 15 , 2026 | 04:23 AM

రాష్ట్రంలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియలో సమస్యలు ఎదురవుతున్నాయి. కొంతమందికి ఎన్యుమరేటర్లకు తెలుగు రాకపోవడంతో పాటు యాప్‌లో సాంకేతిక సమస్యలతో చిక్కులు ఏర్పడుతున్నాయి.

తెలుగు రాదాయె.. యాప్‌ వినదాయె!

  • ప్రహసనంగా జనగణన ప్రక్రియ.. తెలుగు రాని ఎన్యుమరేటర్లతో వివరాల నమోదులో ఇబ్బందులు

  • యాప్‌లోనూ సాంకేతిక చిక్కులు

  • తప్పు వివరాలనుమార్చాలంటే మళ్లీ మొదటికి

  • జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తున్న జనం

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియలో సమస్యలు ఎదురవుతున్నాయి. కొంతమందికి ఎన్యుమరేటర్లకు తెలుగు రాకపోవడంతో పాటు యాప్‌లో సాంకేతిక సమస్యలతో చిక్కులు ఏర్పడుతున్నాయి. పట్టణ, ప్రాంతాల్లో జరుగుతున్న జనగణనలో ప్రజల వివరాలు నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలతో కూడిన బుక్‌లెట్‌ను ఎన్యుమరేటర్లకు అందించింది. దీనికి తోడు అధికారులు క్షేత్రస్థాయిలో శిక్షణ కూడా ఇచ్చారు. అయితే తెలుగు రాని ఎన్యుమరేటర్లకు అచ్చ తెలుగు పదాలు కూడా అర్థమవ్వకపోతుండటంతో ప్రజల వివరాలు నమోదులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జనగణన వివరాలు నింపేందుకు ఇచ్చిన సూచిక కాపీలో పేర్కొన్న ‘కోడ్‌’లనే పట్టికలో నమోదు చేస్తున్నారు. వాస్తవంగా ప్రశ్నపత్రంలో ఉన్న ప్రశ్న ఏంటి, దానికి ప్రజలు చెబుతున్న సమాధానమేంటన్న దానిపై ఎన్యుమరేటర్లు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఉదాహరణకు.. చేతితో తయారు చేసిన పెంకుల ఇల్లు, యంత్రంతో తయారు చేసిన పెంకులతో ఉన్న ఇల్లు అని సూచిక బుక్‌లో ఉంది. ఈ రెండింటికి రెండు కోడ్‌లు ప్రత్యేకంగా ఉన్నాయి. అయితే పెంకు ఇల్లు అనే అర్థం వస్తే చాలన్నట్టుగా ఈ రెండింటికి ప్రత్యేకంగా ఉన్న వాటిలో ఏదో ఒక కోడ్‌ను మాత్రమే నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు ఇల్లు ఉన్న స్వరూపమే మారిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక జనగణన వివరాలు నమోదు చేసే యాప్‌లోనూ పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ ఇల్లు, ఆస్తులు, ఇతరత్రా వివరాలు ఒకేసారి పూర్తిస్థాయిలో చెప్పడానికి పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. ఈ క్రమంలో వారిని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేలోపే ఎన్యుమరేటర్లు వారికి నచ్చినట్లుగా ఆ కాలమ్‌ను నింపేస్తున్నారు. ఇటు ఏదైనా ప్రశ్నకు తాము చెప్పిన సమాధానం తప్పని ప్రజలు చెప్తే.. మళ్లీ మొదటి నుంచి అన్ని వివరాలను నింపుకొంటూ రావాల్సిందే.. తప్పితే తప్పుగా చెప్పిన సమాధానాన్నే మార్చే అవకాశం లేకుండా పోయింది. ‘ప్రీవియస్‌’ అనే ఆప్షన్‌ లేకపోవడంతో ఈ ఇబ్బంది ఎదురవుతోంది. దీంతో ఒక్కో ఇంటి దగ్గరే చాలా సమయం పడుతోంది. సాంకేతిక సమస్యలతో ఒక్కోసారి సేకరించిన వివరాలు సేవ్‌ కాకపోయినా, మళ్లీ మొదటి నుంచి వివరాలను తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని సమాచారం. దీంతో చెప్పిన వివరాలే ఎన్నిసార్లు చెప్పాలంటూ ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నట్టు తెలిసింది. అలాగే సరైన సమాధానాలతో కూడిన ఆప్షన్లను నమోదు చేయకపోవడంతో ప్రజలకు సంబంధించిన వివరాలన్నీ పూర్తిస్థాయిలో, వాస్తవంగా నమోదు కావడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎన్యుమరేటర్లు సేకరించిన డేటా కచ్చితత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై సంబంధిత అధికారులు దృష్టి సారించి తెలుగు వచ్చిన సిబ్బందిని జనగణనలోకి తీసుకోవడంతో పాటు యాప్‌లో సాంకేతిక చిక్కులు తొలగించాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి.

Updated Date - May 15 , 2026 | 04:23 AM