కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు సెన్సస్ ఫ్రీజింగ్ ఆటంకం కాదు!
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:57 AM
దేశవ్యాప్తంగా జనగణన నేపథ్యంలో సరిహద్దులకు సంబంధించిన ఫ్రీజింగ్ ఇప్పటికే అమలులో ఉండగా.. గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం సాధ్యమేనా...
ఆ హక్కు ప్రభుత్వానికి ఉంటుంది
అభిపాయ్రపడుతున్న అధికార వర్గాలు
6 నెలల తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం!
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా జనగణన నేపథ్యంలో సరిహద్దులకు సంబంధించిన ఫ్రీజింగ్ ఇప్పటికే అమలులో ఉండగా.. గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం సాధ్యమేనా? దానికి చట్టబద్ధత ఉంటుందా? ఈ సమయంలో ఆ నిర్ణయం తీసుకోవచ్చా? అంటే.. పాలనా పరమైన అవసరాల ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఫ్రీజింగ్ ఆపలేదని అధికారులు చెబుతున్నారు. జనగణన నేపథ్యంలో పరిపాలనా సరిహద్దులను(మండలాలు, జిల్లాలు, గ్రామాలు, వార్డులు, పట్టణాలు) ఒక నిర్దిష్ట తేదీకి స్థిరంగా నిలిపివేయడాన్నే సెన్సస్ ఫ్రీజింగ్‌గా పరిగణిస్తారు. రాష్ట్రంలో 2025 డిసెంబరు 31 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. వాస్తవానికి జనగణన సమయంలో సరిహద్దులు మారితే జనాభా లెక్కల్లో గందరగోళం ఏర్పడుతుంది. ఆ ఉద్దేశంతోనే కచ్చితమైన గణాంకాల కోసం ఫ్రీజింగ్ తేదీని నిర్ణయిస్తారు. అయితే, పరిపాలన అవసరాల రీత్యా ఏర్పాటు చేసే కొత్త కార్పొరేషన్లకు సెన్సస్ ఫ్రీజింగ్ ఆటంకం కాబోదని పురపాలక శాఖ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు, జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన వెంటనే ఎన్నికలకు వెళ్తారా? లేదా? అంటే.. ఆరు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి జీహెచ్‌ఎంసీలో కొత్తగా కలిసే మునిసిపాలిటీల్లో మౌలిక వసతుల పరంగా కొన్ని లోపాలు ఉన్నాయి.
కొన్ని కాలనీలకు సరైన రహదారులు, డ్రెయినేజీలు లేవు. చాలా చోట్ల వీధిదీపాల కొరత ఉంది.నీటి సరఫరా, చెత్త సేకరణ, రహదారులు, డ్రైనేజీల నిర్మాణం వంటి పనులను పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉందనే చర్చ జరుగుతోంది.