Share News

శ్రీదేవి ఇంట్లో.. స్టే చేస్తారా?

ABN , Publish Date - Aug 17 , 2026 | 04:08 AM

ఒక సినీ తార ఇల్లు.. లేదా సమాజంలో మంచి పేరున్న వ్యక్తి ఇల్లు కనిపిస్తే.. ఒక్క క్షణం ఆగి ‘ఇది ఫలానా వారి ఇల్లు’ అని ఆసక్తిగా చూస్తాం! ఇక ఆ ఇంట్లో ఒకరోజో రెండ్రోజులో ఉండే అవకాశం వస్తే?

శ్రీదేవి ఇంట్లో.. స్టే చేస్తారా?

  • షారుఖ్‌, యువరాజ్‌, అజయ్‌ దేవగన్‌ తదితరుల ఇళ్లలోనూ బసకు చాన్స్‌

  • తమ ఇళ్లను ‘హోమ్‌ స్టే’లుగా మారుస్తున్న బాలీవుడ్‌ నటులు, క్రీడాకారులు

  • హైదరాబాద్‌లోని ప్రముఖ వైద్యులు, వ్యాపారవేత్తలూ అదే దారిలో

  • ఇళ్లు, అభిరుచులు వారివి.. జ్ఞాపకాలు మనవి

(హైదరాబాద్‌ సిటీ - ఆంధ్రజ్యోతి)

ఒక సినీ తార ఇల్లు.. లేదా సమాజంలో మంచి పేరున్న వ్యక్తి ఇల్లు కనిపిస్తే.. ఒక్క క్షణం ఆగి ‘ఇది ఫలానా వారి ఇల్లు’ అని ఆసక్తిగా చూస్తాం! ఇక ఆ ఇంట్లో ఒకరోజో రెండ్రోజులో ఉండే అవకాశం వస్తే? వెండితెరను ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి ఇంట్లో.. ఒకప్పుడు ఆమె తిరిగిన గదుల్లోనే గడిపితే? ఢిల్లీలో షారుక్‌ ఖాన్‌ ఒకప్పుడున్న ఇంట్లో దిగి.. ఉదయాన్నే ఇంటి బయట ఉన్న పచ్చటి పచ్చికలో కూర్చుని వేడివేడిగా కాఫీ తాగితే? ఆ ఊహే ఎంత బాగుందో కదా! ఒకప్పుడైతే అది అసాధ్యమేగానీ.. ఇప్పుడు మాత్రం కాదు. ఎందుకంటే.. షారుక్‌ఖాన్‌, ఆలియాభట్‌, కత్రినాకైఫ్‌, అర్జున్‌ కపూర్‌ తదితర బాలీవుడ్‌ ప్రముఖులు, యువరాజ్‌ సింగ్‌, బైచుంగ్‌ భుటియా వంటి క్రీడాకారులు తమ అభిరుచికి తగ్గట్టుగా.. ఇష్టపడి నిర్మించుకున్న ఇళ్లను ‘హోమ్‌స్టే’లుగా మారుస్తున్నారు. నిర్ణీత అద్దె చెల్లించి.. ఎవరైనా ఆయా ఇళ్లలో ఉండొచ్చు. అక్కడున్న అందమైన పెయింటింగ్స్‌.. అరుదైన వస్తువుల మధ్య గడిపే క్షణాలు.. ఎప్పటికీ చెరగని మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి! అపురూపమైన అనుభూతులుగా నిలిచిపోతాయి!!


అదీ తేడా...: సాధారణ హోటల్‌లో ఒక గది దొరుకుతుంది. కానీ సెలబ్రిటీ హోమ్‌స్టేలో మాత్రం.. ఒక కథలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. ఆ ఇంటి గోడలపై ఫొటోలు, అక్కడ కన్పించే పాత ఫర్నిచర్‌, కళాఖండాలు తోటలు, పుస్తకాలు... అన్నీ ఆయా ప్రముఖుల జీవనశైలిని పరిచయం చేస్తాయి. శ్రీదేవి నివసించిన ఇంటిని హోమ్‌ స్టేగా మారుస్తున్నట్టు ఆమె కుమార్తె జాన్వి చాలా రోజుల క్రితమే ప్రకటించి ఆ ఇంటి ఫొటోలను కూడా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఎంత మంచి అభిరుచితో ఆ ఇంటిని తీర్చిదిద్దారో వాటిని చేస్తేనే అర్థమైపోతుంది. ఇక, ఈ ట్రెండ్‌కు గోవా ఓ ప్రత్యేక వేదికగా నిలిచిందనే చెప్పాలి. నటుడు అర్జున్‌ మాథుర్‌ గోవాలో కొనుగోలు చేసిన ’ట్రాంక్విల్‌ హెవెన్‌‘ను తాము ఉపయోగించని సమయంలో హోమ్‌స్టేగా ఇస్తుంటే.. మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ గోవాలోని ’కాసా సింగ్‌‘ను కూడా ప్రత్యేక స్టేగా అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్‌కు చెందిన పలువురు వైద్యులు, సోషలైట్స్‌, వ్యాపారవేత్తలు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాల్లో తాము ముచ్చటపడి నిర్మించుకున్న ఇళ్లను హోమ్‌స్టేలుగా మారుస్తున్నారు.


ఇన్‌కమ్‌ హోమ్‌గా.. వెకేషన్‌ హోమ్‌!

సెలబ్రిటీలు, సంపన్నులు హాలిడే డెస్టినేషన్లలో విల్లాలు కొనడం... తమ అభిరుచికి తగ్గట్టుగా వాటిని అలంకరించుకోవడం కొత్తేమీ కాదు. కొత్తగా మారుతున్నది మాత్రం వాటి వినియోగమే! ఎందుకంటే.. ఏడాదిలో కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు మాత్రమే వారు అక్కడ ఉంటారు. మిగతా సమయంలో ఇల్లు ఖాళీ. కానీ కేర్‌టేకర్‌.. సెక్యూరిటీ.. గార్డెనింగ్‌.. విద్యుత్‌.. సహా నిర్వహణ ఖర్చులు మాత్రం భారీగా ఉంటాయి. అదే ఇంటిని.. ఎంపిక చేసిన అతిథులకు అద్దెకు ఇస్తే? ఆ ఖర్చులన్నీ పోగా ఆదాయం కూడా వస్తుంది. అంటే.. వెకేషన్‌ హోమ్‌ కాస్తా ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఇన్‌కమ్‌ హోమ్‌గా మారుతుందన్నమాట. అదే ఈ ట్రెండ్‌కి అసలు కారణం.

అద్దె ఎక్కువే అయినా..

సెలబ్రిటీల ఇళ్లలో బస చేయాలంటే ఖర్చూ అదే స్థాయిలో ఉంటుంది. సాధారణ విల్లాలు కొన్ని వేల రూపాయల నుంచి మొదలవుతుంటే.. లగ్జరీ సెలబ్రిటీ విల్లాలు మాత్రం ఒక రాత్రికి రూ.50వేల నుంచి మొదలై రూ.లక్షపైగా పలుకుతున్నాయి. గోవాలో అజయ్‌ దేవ్‌గన్‌కు చెందిన ‘విల్లా ఎటర్నా’లో బస చేయాలంటే ఒక రాత్రికి రూ.75వేలు కట్టాలి. గోవాలో తమ ఇంటిని ఒక రాత్రికి రూ.6వేల అద్దెతో ఇస్తున్నామని, దాదాపు ఏడాదంతా అది ఫుల్‌గానే ఉంటోందని హైదరాబాద్‌కు చెందిన ఒక పారిశ్రామికవేత్త భార్య తెలిపారు.

Updated Date - Aug 17 , 2026 | 04:11 AM