అంబరాన్నంటిన సంబరాలు
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:09 AM
జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. పిల్లలు మొదలు వృద్ధు ల వరకు వేడుకల్లో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. డిసెంబరు 31 అర్ధరాత్రి 12 గంటలకు గత ఏడాదికి వీడ్కోలు పలికి 2026 కొత్త సంవత్సరానికి కొత్త ఆశలతో, సరికొత్త ఉత్సాహంతో స్వాగతం పలికారు.
నూతన సంవత్సరానికి ఘన స్వాగతం
మోత్కూరు, యాదగిరిగుట్ట, భువనగిరి టౌన్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. పిల్లలు మొదలు వృద్ధు ల వరకు వేడుకల్లో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. డిసెంబరు 31 అర్ధరాత్రి 12 గంటలకు గత ఏడాదికి వీడ్కోలు పలికి 2026 కొత్త సంవత్సరానికి కొత్త ఆశలతో, సరికొత్త ఉత్సాహంతో స్వాగతం పలికారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, మంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుక ల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నూతన ఏడాదిలో అంతా శుభం జరగాల ని ప్రజలు ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గురువారం తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో బారులుతీరారు. అదేవిధంగా చర్చీల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా విందులు, వినోదాలు సాగాయి. అర్ధరాత్రి 12గంటలు దాటగా నే కేక్ కట్ చేసి ఒకరినొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఉదయం మహిళలు ఇళ్ల ముందు రకరకాల ముగ్గులు వేసి రంగులు అద్ది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. యాదగిరిగుట్టలో వేకువజామున నుంచి భక్తులు సాధారణ స్థాయిలో ఉండగా, ఉదయం 10 గంటల నుంచి క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ప్రత్యేక దర్శనానికి గంట, ధర్మదర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఉదయం, సాయంత్రం బ్రేక్ దర్శనాలు మధ్యాహ్నం (ఆరగింపు) సమయాలతో కలిపి దర్శన క్యూలైన్లు నిలిపివేయడంతో సుమారు మూడు గంటల పాటు ఉభయ క్యూలైన్లల్లో భక్తులు వేచి ఉన్నారు. లక్ష్మీనృసింహుడిని 50వేల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వర్ణగిరి ఆలయానికి సైతం భక్తులు పోటెత్తారు.
పోలీసుల నిఘాతో ప్రశాంతంగా వేడుకలు
జిల్లా పోలీసులు మూడు రోజులుగా తీసుకున్న కఠిన నిర్ణయాలతో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. మద్యం తాగి రోడ్డుపై వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. గతంలో నేరాలు చేసిన వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. దీంతో యువత మద్యం మత్తులో రోడ్లపైకి వెళ్లేందుకు భయపడేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పోలీస్ సిబ్బంది పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహించారు. దీంతో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. 49 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. భువనగిరి ట్రాఫిక్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో 22, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ పరిధిలో 27 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి ఓ యువకుడు మద్యం మత్తులో బైక్ నడపడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. అదే సమయంలో గుర్తుతెలియని వాహనం అతడిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.