నామినేషన్ పత్రంలో ప్రతీ కాలమ్ నింపాలి
ABN , Publish Date - Jul 18 , 2026 | 06:08 AM
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పత్రాలు పూర్తి చేయడంలో నిబంధనలు పాటించాల్సిందే
ఎన్నికల అధికారులు చూసీ చూడనట్లున్నా ప్రత్యర్థులు లోపాల్ని ఎత్తిచూపుతారు
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై జ్ఞానేశ్‌కుమార్ వ్యాఖ్యలు
‘సర్’తో సీఎం రేవంత్‌కు ఉన్న 2 ఓట్లలో ఒకటే మిగులుతుంది: సీఈసీ
కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో తొలి ‘ఆల్ ఇండియా మీడియా కాన్ఫరెన్స్’
హైదరాబాద్, న్యూఢిల్లీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫామ్స్ నింపడంలో నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందేనని.. నామినేషన్ పత్రంలో ప్రతీ కాలం భర్తీ చేయాలని ఎన్నికల నిబంధన ఉందన్నారు. కొన్నిసార్లు ఎన్నికల అధికారులు చూసీ చూడనట్లున్నా.. రాజకీయ ప్రత్యర్థులు లోపాలను ఎత్తిచూపుతారన్నారు. మీనాక్షి నటరాజన్ విషయంలో ప్రత్యర్థులు ఫిర్యాదు చెయ్యకపోతే పరిస్థితి మరోలా ఉండేదేమోనన్నారు. కోర్టు కేసు వివరాలను భర్తీ చేయాలని ఆమెకు సమయం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారన్నారు. ఒకసారి రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకున్న తర్వాత తన పరిధిలో ఉండదని సీఈసీ వెల్లడించారు. మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టుకు వెళ్లినా ఆర్‌ఓ నిర్ణయాన్నే సమర్థించిందన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియతో సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న రెండు ఓట్లలో ఒకటే మిగులుతుందన్నారు. కాగా ఈసీఐ మొదటిసారిగా న్యూఢిల్లీలో ‘ఆల్ ఇండియా మీడియా కాన్ఫరెన్స్-2026’ నిర్వహించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 380 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ‘‘భాగస్వాములను అనుసంధానించడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం - ఎన్నికలలో మీడియా పాత్ర’’ అనే ప్రత్యేక అంశంతో దీనిని నిర్వహించింది. ఈ సందర్భంగా జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ... దేశంలో ప్రతిఎన్నిక రాజ్యాంగం, ప్రజా ప్రాతినిధ్య చట్టాలు, సమయానుకూలంగా ఈసీఐ జారీ చేసే నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా జరుగుతుందన్నారు.
ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియను ఇందులో భాగస్వాములైన వారే ఎప్పటికప్పుడు ఆడిట్ చేస్తుంటారని తెలిపారు. ఓటర్ల జాబితా ‘సజీవపత్రం’ లాంటిదన్నారు. ప్రస్తుతం దేశంలో 95 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఓటర్ల జాబితా తయారీలో పారదర్శకతకు చట్టబద్థమైన రక్షణలు ఉన్నాయని చెప్పారు. క్షేత్రస్థాయిలో 12 లక్షల మందికి పైగా బూత్ లెవెల్ అధికారులు, 15 లక్షల మందికి పైగా బూత్ లెవెల్ ఏజెంట్లు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారని వివరించారు. ఎన్నికల ప్రక్రియలోని పారదర్శకతపై అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్యోద్దేశమని జ్ఞానేష్ కుమార్ తెలిపారు.