భూ భారతికి సీ-డాక్ రక్షణ
ABN , Publish Date - Feb 21 , 2026 | 02:50 AM
భూభారతి పోర్టల్‌లోని భద్రతా లోపాలను సరిదిద్దేందుకు రెవెన్యూశాఖ సన్నద్ధమైంది. కోట్లాది మంది ప్రజల వ్యక్తిగత డేటాకు, రూ.వేల కోట్ల భూముల లావాదేవీలకు రక్షణ కవచంలా నిలిచేందుకు.....
కేంద్రప్రభుత్వ సంస్థకు కోడ్ ఆడిటింగ్ బాధ్యతను అప్పగించిన రెవెన్యూశాఖ
చలానాల కుంభకోణంతో అప్రమత్తం
డేటా రక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు యోచన
ఉన్నతస్థాయి కమిటీ నివేదిక నేపథ్యంలో కసరత్తు వేగవంతం
పలు ప్రభుత్వ విభాగాల్లో పాత సాఫ్ట్‌వేర్‌తోనే పనులు
వాటిల్లోనూ ఆడిటింగ్ నిర్వహించాలంటున్న అధికారులు
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్ర జ్యోతి): భూభారతి పోర్టల్‌లోని భద్రతా లోపాలను సరిదిద్దేందుకు రెవెన్యూశాఖ సన్నద్ధమైంది. కోట్లాది మంది ప్రజల వ్యక్తిగత డేటాకు, రూ.వేల కోట్ల భూముల లావాదేవీలకు రక్షణ కవచంలా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెంటర్ ఫర్ డెవల్‌పమెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్’ (సీ-డాక్)ను రంగంలోకి దింపింది. భూభారతి పోర్టల్‌లో తలెత్తుతున్న సాంకేతిక లోపాలను సరిదిద్దేందుకు కోడ్ ఆడిటింగ్ బాధ్యతలను సీడాక్‌కు అప్పగించింది. తెలంగాణ టెక్నాలజీస్ సర్వీసెస్ (టీఎ్‌సటీఎస్) నేతృత్వంలో సీ-డాక్ కోడ్ ఆడిటింగ్‌ను నిర్వహించనుంది. కేంద్ర ఎలకా్ట్రనిక్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని సీడాక్.. రాష్ట్రంలో పలు విభాగాల సైట్‌లకు ఇప్పటికే సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది.
కోడింగ్ లోపాలపై నివేదిక
ధరణి ప్రారంభం నుంచి సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటికి నివేదిక ఇచ్చింది. ధరణి సాఫ్ట్‌వేర్ రూపొందించిన టెర్రాసిస్ సంస్థ సాంకేతిక లోపాలను విస్మరించిందని, కోడ్ ఆడిటింగ్ చేపట్టలేదని అధికారులు మంత్రికి వివరించారు. 2024లో భూభారతి పోర్టల్‌ను అమల్లోకి తీసుకొచ్చే క్రమంలో ప్రభుత్వం ధరణి పోర్టల్ నుంచి డేటాను భూభారతి పోర్టల్‌కు బదలాయించే బాధ్యతను ఎన్‌ఐసీ సంస్థకు అప్పగించింది. సుమారు 80 లక్షల మంది రైతులు, 1.6 కోట్ల ఎకరాల భూముల వివరాలతోపాటు రోజుకు 40 నుంచి 50 వేల లావాదేవీలు జరిగే కీలక పోర్టల్ ఇది. అయితే ఎన్‌ఐసీ సంస్థ డేటా బదిలీ సమయంలో సాంకేతిక లోపాలను గుర్తించలేదు. లోపాలను పసిగట్టి ఉంటే చలానాల కుంభకోణం వంటిది జరిగేది కాదనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. జనగాం, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో వెలుగు చూసిన చలానా కుంభకోణం సాంకేతిక వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. పోర్టల్‌లో ఉన్న లోపాలను ఆసరా చేసుకుని నిధులను దారి మళ్లిస్తున్నా.. శ్రీకాంత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసే వరకు ఎన్‌ఐసీ గుర్తించలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. 2020 అక్టోబరులో ధరణి అమల్లోకి రాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కోడ్ ఆడిటింగ్ జరగలేదని తెలిసి రెవెన్యూ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. పోర్టల్ భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగం అవసరం ఉందని ఉన్నత స్థాయి కమిటీ తమ నివేదికలో అభిప్రాయ పడినట్లు తెలిసింది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయిన ప్రతిసారి సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో భూభారతి పోర్టల్‌ను మరింత బలోపేతం చేసేందుకు సీడాక్ సేవలను వినియోగించుకోవాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది.
పలు విభాగాల్లో పాత సాఫ్ట్‌వేరే!
పాత కాలం నాటి సాఫ్ట్‌వేర్ మీదనే ఆధారపడి పలు ప్రభుత్వ విభాగాలు నడుస్తున్నాయి. నేటికీ పాత కోడింగ్ లాంగ్వేజ్‌ను ఉపయోగిస్తున్నాయి. వీటిని ఆడిట్ చేయడం, అప్‌డేట్ చేయడం సవాలుగా తయారైంది. ప్రైవేటు సంస్థలు తయారు చేసే సాఫ్ట్‌వేర్ కోడ్‌పై ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో పట్టు ఉండదు. దీని వల్ల కొన్నిసార్లు భద్రత పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రజల డేటా భద్రతతోపాటు, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెట్టే శాఖల్లో సాఫ్ట్‌వేర్ ఆడిటింగ్‌కు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.