Share News

సీసీకెమెరా.. భద్రతకు భరోసా

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:39 AM

సీసీ కెమెరాల సహాయంతో పోలీసులు అనేక కేసులకు చెక్‌ పెడుతున్నారు.

సీసీకెమెరా.. భద్రతకు భరోసా

అనేక కేసుల పరిష్కారం

ప్రజల ఆస్తుల భద్రతకు భరోసా

సూర్యాపేటలో నగల దుకాణం కేసు ఛేదనలో ముఖ్య భూమిక

సీసీ కెమెరాల సహాయంతో పోలీసులు అనేక కేసులకు చెక్‌ పెడుతున్నారు. 70 నుంచి 80 శాతం కేసులను సీసీకెమెరాల ఆధారంగానే ఛేదిస్త్తున్నారు. గ్రామాల్లో, వ్యాపార సముదాయాలు, వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల ప్రజలకు ఆర్థిక భద్రతే కాకుండా పోలీసులు వెంటనే నిందితులను పట్టుకునే అవకాశముంది.

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట)

ఇప్పటికీ అనేక పట్టణాల్లో సీసీటీవీ కెమెరాలు లేవు. బంగారం దుకాణాదారులు, వస్త్ర దుకాణాదారులు, పెద్దపెద్ద షాపింగ్‌మాల్‌ నిర్వహకులు, బ్యాంకుల్లో, సీసీటీవీ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. అనేక కాలనీల్లో తలాకొంత డబ్బు వేసుకొని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సూర్యాపేట డివిజన్‌లో వివిధ దుకాణాదారులు 1155దాకా, కమ్యూనిటీ సెంటర్‌లలో 165 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. కోదాడ డివిజన్‌ పరిధిలో 1516 మంది వ్యాపారులు, వివిధ కాలనీల్లో 249 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. సూర్యాపేట పట్టణంలో వ్యాపారులు 251, కాలనీల్లో 68, కోదాడ పట్ట్టణంలో వ్యాపారులు 355, కాలనీల్లో 51, హుజూర్‌నగర్‌లో 304 మంది వ్యాపారులు, కమ్యూనిటీ పరంగా 54మంది సీసీ కెమెరాలువినియోగిస్తున్నారు. చిన్న మునిసిపాలిటీలు తిరుమలగిరిలో 198, కమ్యూనిటీ సెంటర్‌లో 10, నేరేడుచర్లలో వ్యాపారులు 104, కమ్యూనిటీ సెంటర్‌లలో 27సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ఎన్‌హెచ్‌ 65పై జనగామ-సూర్యాపేట హైవేపై 18, కోదాడ- మిర్యాలగూడహైవైపై 35 పనిచేస్తుండగా కమాండ్‌ ఆండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు 454 కెమెరాల సంఖ్య అనుసంధానమైనది.

అనేక కేసులకు మార్గం చూపి..

సూర్యాపేట జిల్లాలో 2025 జనవరి నుంచి 2025 డిసెంబరు వరకు 6,065 కేసులు నమోదయ్యాయి. వీటిలో దొంగతనాలు, హత్యలు, ఘర్షణ కేసులు, పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా, అనుమతి లేకుండా ఇసుక రవాణా, గంజాయి సరఫరా, రేప్‌కేసులు, మర్డర్‌కేసులు, వైట్‌ కాలర్‌ కేసులు, రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి. నమోదైన 6065 కేసుల్లో దాదాపు 70 నుంచి 80శాతం సీసీటీవీ కెమెరాలు ద్వారా నిందితులను పట్టుకొని కోర్టుకు రిమాండ్‌ చేశారు.

నగల దుకాణం కేసు ఛేదనలో..

ఇటీవల సూర్యాపేట జిల్లాకేంద్రంలోని మహాత్మాగాంధీ రోడ్డులో గల బంగారం దుకాణంలో రూ.కోట్ల విలువైన బంగారాన్ని దొంగలు దోచుకున్నారు. దొంగలు ఎక్కడినుంచి వచ్చారు.. ఎలావచ్చారు.. విచారణ చేసి సమీపంలో దొంగలు అద్దెకుతీసుకున్న ఇంటి యజమానిని ప్రశ్నించడంతో గుట్టు బయటపడింది. దాదాపు బంగారాన్ని రికవరీ చేసి బంగారు దుకాణ నిర్వాహకుడికి అందజేశారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

సీసీ కెమెరాలు అమర్చుకోవడం వల్ల నేరస్తులను త్వరగా పట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇళ్ల వద్ద, వ్యాపార సముదాయాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. వీధుల్లో కూడా తలాకొంత భాగస్వామం చేసుకొని సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా సీసీటీవీ కెమెరాలు చూసి నిందితులను పట్టుకోవచ్చు.

నరసింహ, సూర్యాపేట జిల్లా ఎస్పీ.

Updated Date - Feb 27 , 2026 | 12:39 AM