Share News

కార్పొరేట్‌ విద్యాసంస్థకు రూ.8 లక్షల జరిమానా

ABN , Publish Date - Jun 24 , 2026 | 05:02 AM

జేఈఈ అడ్వాన్స్డ్‌ పరీక్షల ఫలితాలకు సంబంధించి విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చినందుకుగాను తెలుగు..

కార్పొరేట్‌ విద్యాసంస్థకు రూ.8 లక్షల జరిమానా

  1. జేఈఈ-అడ్వాన్స్డ్‌ ఫలితాలపై తప్పుడు ప్రకటన ఇచ్చిన విద్యా సంస్థపై కొరడా

  2. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ చర్యలు

  3. యాడ్‌లో విద్యార్థుల ర్యాంకులే గానీ వారు చదివిన కోర్సుల వివరాలు లేవు

  4. ఇటువంటి ప్రకటనలతో లక్షలాదిమంది విద్యార్థులపై ప్రభావం

  5. ఇకపై పూర్తి వివరాలతో ప్రకటనలు ఇవ్వాలని ఆదేశం

న్యూఢిల్లీ, జూన్‌ 23: జేఈఈ అడ్వాన్స్డ్‌ పరీక్షల ఫలితాలకు సంబంధించి విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చినందుకుగాను తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ప్రముఖ కార్పొరేట్‌ విద్యాసంస్థకు ‘కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ’ (సీసీపీఏ) రూ.8 లక్షల జరిమానా విధించింది. చీఫ్‌ కమిషనర్‌ నిధి ఖరే, కమిషనర్‌ అనుపమ్‌ మిశ్రాలతో కూడిన బెంచ్‌ ఈ నెల 11న జారీ చేసిన ఈ ఆదేశాల వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్డ్‌-2024 పరీక్షల ఫలితాల్లో తమ విద్యార్థులు సాధించిన విజయాల పేరిట సదరు సంస్థ తమ వెబ్‌సైట్‌లో, సోషల్‌ మీడియాలో, పత్రికల్లో విడుదల చేసిన ప్రకటనలను సీసీపీఏ సుమోటోగా తీసుకొని ఈ విచారణ జరపటం విశేషం. విద్యార్థుల పేర్లను, ర్యాంకులను ప్రముఖంగా వెల్లడించిన ఈ ప్రకటనలు.. ఆ విద్యార్థులు ఆ విద్యాసంస్థలో ఏ కోర్సుల్లో శిక్షణ తీసుకున్నారన్నదానిని వెల్లడించలేదని సీసీపీఏ పేర్కొంది. ఫుల్‌టైమ్‌ క్లాస్‌రూం కోచింగ్‌, డిస్టెన్స్‌ లెర్నింగ్‌, షార్ట్‌టైం కోర్సుల్లో దేనిని ఆ విద్యార్థులు ఎంపిక చేసుకున్నారన్న వివరాలు లేవని గుర్తు చేసింది. అడ్వర్టైజ్‌మెంట్‌లో స్థలాభావం కారణంగా ఆ వివరాలు పేర్కొనలేదన్న విద్యాసంస్థ వాదనను తిప్పికొడుతూ.. వెబ్‌సైట్‌లో స్థలాభావం సమస్య లేనప్పటికీ, అక్కడ కూడా కోర్సుల వివరాలు వెల్లడించలేదని తెలిపింది. ‘ఏఐఆర్‌ 1’ అంటూ చేసిన ప్రకటనలో ఆ ర్యాంకు ఏ క్యాటగిరీలో వచ్చిందన్న వివరాలు లేవని పేర్కొంది. ఇటువంటి తప్పుడు ప్రకటనల వల్ల లక్షలాది మంది ఐఐటీ-జేఈఈ విద్యార్థుల మీద ప్రభావం పడుతుందని, కాబట్టే, జరిమానా విధిస్తున్నామని స్పష్టం చేసింది. భవిష్యత్తులో జారీ చేసే అన్ని ప్రకటనల్లోనూ విద్యార్థుల పేర్లు, ర్యాంకులతో సమానంగా పూర్తి వివరాలు కూడా ప్రముఖంగా వెల్లడించాలని పేర్కొంది. తప్పుడు ప్రకటనలను తక్షణం నిలిపివేయాలని, తీసుకున్న చర్యలపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సదరు కార్పొరేట్‌ విద్యాసంస్థను సీసీపీఏ ఆదేశించింది.

Updated Date - Jun 24 , 2026 | 05:02 AM