Share News

మళ్లీ ‘గ్లోబరీనా’ అలజడి!

ABN , Publish Date - May 28 , 2026 | 03:06 AM

అది 2019 ఏప్రిల్‌ 18వ తేదీ.. తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఒక్కసారిగా అలజడి.. ఎంతో బాగా రాసిన విద్యార్థులు ఫెయిలయ్యారు..

మళ్లీ ‘గ్లోబరీనా’ అలజడి!

  • 2019లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం.. మెరిట్‌ విద్యార్థులకు సున్నా మార్కులు

  • ఆందోళనతో 25 మంది విద్యార్థుల ఆత్మహత్య

  • ఇప్పుడు ‘కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌’ సంస్థ పేరుతో సీబీఎస్ఈ ఓఎస్ఎం కాంట్రాక్టు

  • జవాబుపత్రాల తారుమారుతో తీవ్ర కలకలం

  • ఆందోళనలో 18 లక్షల మందికిపైగా విద్యార్థులు

హైదరాబాద్‌, మే 26: అది 2019 ఏప్రిల్‌ 18వ తేదీ.. తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఒక్కసారిగా అలజడి.. ఎంతో బాగా రాసిన విద్యార్థులు ఫెయిలయ్యారు.. మెరిట్‌ విద్యార్థులకు సున్నా మార్కులు వచ్చాయి.. పరీక్ష రాసినవారు గైర్హాజరైనట్టు చూపింది.. 25 మంది విద్యార్థులు ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నారు.. మరెందరో మానసిక ఆందోళనలో కూరుకుపోయారు. సుమారు 3 లక్షల మంది విద్యార్థుల మార్కుల్లో తేడాలు వచ్చాయి. దీనంతటికీ ఇంటర్‌ సమాధాన పత్రాల డిజిటైజేషన్‌, ఫలితాల ప్రాసెసింగ్‌ బాధ్యతలను నిర్వర్తించిన హైదరాబాద్‌ ప్రైవేటు సంస్థ ‘గ్లోబరీనా’ నిర్వాకం కారణమని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో సీబీఎస్ఈ ఫలితాల వివాదంతో మళ్లీ ‘గ్లోబరీనా’ తెరపైకి వచ్చింది. నాటి గ్లోబరీనా టెక్నాలజీస్‌ రూపుమార్చుకుని ‘కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌’గా మారిందని.. లక్షలాది మంది విద్యార్థుల ఆశలను గల్లంతు చేసిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. నాటి గ్లోబరీనా టెక్నాలజీస్‌ సీఈవో వీఎ్‌సఎన్‌ రాజు ప్రస్తుత కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌ సంస్థకు కూడా సీఈవోనే కావడం గమనార్హం.

ఓఎస్ఎం ప్రక్రియలో గందరగోళం

సీబీఎస్ఈ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) ఈ ఏడాదే తొలిసారిగా 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం కోసం ఆన్‌స్ర్కీన్‌ మార్కింగ్‌ (ఓఎస్ఎం) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌ సంస్థను ఎంపిక చేసింది. ఓఎ్‌సఎం విధానంలో విద్యార్థుల సమాధాన పత్రాలను నేరుగా దిద్దకుండా.. వాటి స్కాన్‌ కాపీలను వ్యాల్యూయేటర్లకు ఆన్‌లైన్‌లో పంపి మూల్యాంకనం చేయిస్తారు. మూల్యాంకన ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా జరుగుతుందనేది దీని ముఖ్య ఉద్దేశం. కానీ ఈ ఓఎస్ఎం విధానంలో స్కాన్‌ చేసిన సమాధాన పత్రాల కాపీలు సరిగా కనిపించకపోవడం (బ్లర్‌గా ఉండటం), చాలా మంది విద్యార్థుల సమాధాన పత్రాలు వేరే విద్యార్థుల పేరిట మూల్యాంకనంలోకి వెళ్లడం వంటివి బయటపడ్డాయి.


ఈ ఏడాది మొత్తంగా 18 లక్షల మంది వరకు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వారికి సంబంధించిన 98 లక్షల సమాధాన పత్రాలను స్కాన్‌ చేసి, మూల్యాంకనానికి సంబంధించిన మాడ్యూల్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఇందులో ఎంత మంది విద్యార్థులకు చెందిన ఎన్ని పత్రాలు తారుమారు అయ్యాయన్నది ఆందోళన రేకెత్తిస్తోంది. కాగా, తమ సంస్థపై వస్తున్న ఆరోపణలను కోఎంప్ట్‌ సీఈవో వీఎస్ఎన్‌ రాజు ఖండించారు. తమ సంస్థ తగిన సాంకేతిక సామర్థ్యాన్ని నిరూపించుకుని, తక్కువ ధర కోట్‌ వేసి సీబీఎస్ఈ బిడ్‌ను దక్కించుకుందని స్పష్టం చేశారు. కాగా, ఓఎస్ఎం విధానంలో విద్యార్థులు రీవ్యాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం తక్కువేనని మూల్యాంకన విధుల్లో పాల్గొన్న కొందరు అధ్యాపకులు స్పష్టం చేస్తున్నారు. సరిగా కనబడకపోవడం, ఒకే పత్రాలు ఎక్కువసార్లు రావడం వంటి కారణాలతో తాను 30 సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయకుండా తిరస్కరించినట్టు ఓ టీచర్‌ చెప్పారు. విద్యార్థులు రీవ్యాల్యూయేషన్‌, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నా.. ఓఎస్ఎం విధానంలో అవే తారుమారైన, సరిగా కనిపించని పత్రాలు వస్తాయని.. వాటిని మూల్యాంకనం ఎలా చేయగలమని మరో టీచర్‌ ప్రశ్నించారు.

రాహుల్‌ ఆరోపణలు అవాస్తవం: సీబీఎస్ఈ

సీబీఎస్ఈ పరీక్షల్లో అవకవకలు, కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌తో కలిసి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలను సీబీఎస్ఈ ఖండించింది. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్‌’లో ప్రకటన విడుదల చేసింది. ‘‘కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌కు ఓఎస్ఎం కాంట్రాక్టు ఇవ్వడంపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అవన్నీ పూర్తిగా అవాస్తవమైన, తప్పుదారి పట్టించే ఆరోపణలు. కాంట్రాక్టు కేటాయింపులో నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాం. గత ఏడాది ఆగస్టు 28న ఈ కాంట్రాక్టుకు సంబంధించిన టెండర్‌ను కేంద్ర ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌లో పెట్టాం. అర్హత సాధించిన బిడ్డర్‌కు కాంట్రాక్టును అప్పగించాం..’’ అని పేర్కొంది.

Updated Date - May 28 , 2026 | 03:06 AM