ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు
ABN , Publish Date - Jan 24 , 2026 | 05:00 AM
ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ భూములు అన్యాక్రాంతమయ్యాయని హైకోర్టులో పిటిషన్ దాఖలయింది.
1,289 ఎకరాల్లో సగానికి పైగా కబ్జా
సీబీఐ విచారణ జరపాలని హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ భూములు అన్యాక్రాంతమయ్యాయని హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఈ సొసైటీ నిర్వాహకులుగా ఉన్న రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సభ్యుడు కృష్ణమూర్తి సహా మరికొందరు పిటిషన్ వేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘1980లో సొసైటీ ఏర్పడిన తర్వాత సభ్యులకు ఇళ్ల స్థలాలు, ఇతర అవసరాల కోసం 1,289 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇందులో 836ఎకరాలు పట్టా భూమి, 453 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. కొంత భూమిని లేఔట్‌గా మార్చి 5 వేల మంది సభ్యులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఈ కేటాయింపులో అక్రమాలు జరగడంతో ప్రభుత్వం 2006లో సహకార సొసైటీ సబ్ రిజిస్ట్రార్‌ను పర్సన్ ఇన్ ఇన్‌చార్జి(పీఐసీ)గా నియమించింది. ఆరు నెలల తర్వాత జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌వో)ను సొసైటీ పీఐసీ చైర్మన్‌గా నియమించింది. అప్పటి నుంచి 20 ఏళ్ల పాటు డీఆర్‌వోల అధీనంలోనే సొసైటీ కార్యకలాపాలు కొనసాగాయి. 20 ఏళ్లుగా రెవెన్యూ అధికారులు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. 1,289 ఎకరాల్లో సగానికిపైగా భూములు అన్యాక్రాంతమయ్యాయి. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదు. 2006 నుంచి సొసైటీ కార్యకలాపాలపై సీబీఐ చేత విచారణ ఆదేశించాలి’ అని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్, రెవెన్యూ, సహకార, వ్యవసాయశాఖల ముఖ్య కార్యదర్శులు, సహకార శాఖ కమిషనర్, సంగారెడ్డి కలెక్టర్‌తోపాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.