Share News

kumaram bheem asifabad- రోడ్లపైనే పశువులు

ABN , Publish Date - Jul 29 , 2026 | 11:00 PM

రహదారిపై పశువుల సంచారం వాహనదారులకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. రహదారులపై ఎక్కడ పడితే అక్కడ పశువులు సేదతీ రుస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో పశువుల సంచారం చిక్కులు తెచ్చిపెడుతోంది.

kumaram bheem asifabad- రోడ్లపైనే పశువులు
బెజ్జూరులో ప్రధాన రహదారిపై సంచరిస్తున్న పశువులు

బెజ్జూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి); రహదారిపై పశువుల సంచారం వాహనదారులకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. రహదారులపై ఎక్కడ పడితే అక్కడ పశువులు సేదతీ రుస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో పశువుల సంచారం చిక్కులు తెచ్చిపెడుతోంది. దీంతో నిత్యం ప్రమాదాలు పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులకు, ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా పశువులు రహదారిపై తిరుగుతుండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మండల కేంద్రంలోని గాందీ చౌక్‌ నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకు వరకు బస్టాండ్‌ ప్రాంతంలో పాటు ఇతర మార్గాల్లో పశువుల సంచారం అదికంగా ఉండటం వల్ల ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల భారిన పడుతున్నారు. పశువులు ఎక్కడ పడితే అక్కడే ఉండటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాటిని తప్పించే క్రమంలో అదుపు తప్పి కింద పడుతున్నారు. కొన్ని సమయాల్లో నిత్యం ట్రాపిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. మరికొన్ని సమయాల్లో పశువులు మృత్యువాత పడుతున్నాయి. అయినప్పటికీ రోడ్లపై తిరుగుతున్న పశువులను తరలించడంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.

- యజమానులకు సమాచారం ఇచ్చినా..

రోడ్లపై పశువుల సంచారాన్ని నియంత్రించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా పూర్తిస్థాయిలో సఫలం కావడం లేదు. ఇష్టారీతినా పశువులను వదిలేస్తున్న యజమానులపై చర్యలు తీసుకుంటామని ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై ప్రజలు ఎన్నో సార్లు గ్రామ పంచాయతి అధికారులకు, పోలీసులకు పిర్యాదు చేశారు. అయినా పశు యజమానులు నుంచి స్పందన రావడం లేదు. రహదారిపై తిరుగుతున్న పశువులను గోశాలకు తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. గత కొద్దేళ్లుగా ఇలాగే పశువులు రోడ్ల వెంట తిరుగుతూ ప్రయాణీకుల పాలిట శాపంగా మారుతోంది. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

- పారిశుధ్యానికి ఆటంకం..

పశువులు నిరంతరం తిరుగుతూ పారిశుధ్యానికి విఘాతం కలిగిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. బస్టాండ్‌ ఆవరణలో ఉన్న దుకాణ యజమానులు షాపుల ముందు నిల్వ చెత్తను వ్యర్థాలను రహదారులపై పారేస్తున్నారు. ఈ క్రమంలో ఆహరం వేటలో తిరుగుతున్న పశువులు చెత్తను చెల్లాచెదురు చేస్తున్నాయి. దీంతో పారిశుద్ధ్యం పేరుకపోతోంది. పశువులు రోడ్లపై తిరుగుతూ చెత్తను అస్తవ్యస్థంగా మారుస్తున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పశువుల సంచారం వల్ల రోడ్డంతా అపరిశుభ్రంగా మారి వ్యాదులు వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ప్రమాదాలు కూడా ఎక్కువగా అవుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు స్పందించి రోడ్లపై పశువులు తిరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అదే విదంగా మండల కేంద్రంలో ఆదివారం వారసంత నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో సంతలో వివిద గ్రామాల నుంచి వ్యాపారులు, కొనుగోలు దారులు వస్తుంటారు. సంతలో పశువుల సంచారం కూడా ఎక్కువగా మారింది. దీంతో ఒక్కోసారి పశువులు వ్యాపారులు, కొనుగోలుదారులపై పరుగెత్తుక వస్తుండటంతో పలువురు గాయాల పాలవుతున్నారు.

స్పందించకుంటే చర్యలు..

- దుర్గం సరోజ, సర్పంచ్‌, బెజ్జూరు

పశువుల యజమానులు స్పందించకుంటే చర్యలు తీసుకుంటాం. రోడ్లపై పశువులు ఎక్కడ పడితే అక్కడే ఉండి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. దీంతో వాటి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పశువుల యజమానులకు నోటీసులు అందచేశాం. యజమానులు స్పందించకుంటే చర్యలు తీసుకుంటాం. రోడ్లపై పశువుల సంచారం లేకుండా తగిన చర్యలు చేపడతాం.

Updated Date - Jul 29 , 2026 | 11:00 PM