Share News

బోనాల ఉత్సవంలో కులవివక్ష

ABN , Publish Date - May 20 , 2026 | 03:22 AM

బోనాల ఉత్సవంలో దళిత మహిళలను అడ్డుకుని, కులం పేరుతో దూషించడంతో వారంతా బోనాలతో రాస్తారోకో నిర్వహించారు.

బోనాల ఉత్సవంలో కులవివక్ష

  • ఆలయం వద్ద అడ్డుకుని కులం పేరుతో దూషణ

  • నిరసిస్తూ బోనాలతో దళిత మహిళల రాస్తారోకో

  • 20 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

కాల్వశ్రీరాంపూర్‌, మే19 (ఆంధ్రజ్యోతి): బోనాల ఉత్సవంలో దళిత మహిళలను అడ్డుకుని, కులం పేరుతో దూషించడంతో వారంతా బోనాలతో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం దళిత మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు 20 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని పెగడపల్లిలో ఐదేళ్లకోసారి వైభవంగా రేణుక ఎల్లమ్మ బోనాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఎల్లమ్మ తల్లి కొలుపు సందర్భంగా గౌడ కులస్థులతోపాటు దళిత మహిళలు కూడా బోనాలతో బయలుదేరారు. ఆలయ సమీపంలో గౌడ కులానికి చెందిన కొందరు మహిళలు వారిని లోపలికి రాకుండా అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా, కులంపేరుతో దూషించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత మహిళలు మంగళవారం ఉదయం బోనాలతో రాస్తారోకో నిర్వహించారు. కులవివక్షకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 4 గంటలపాటు ఆందోళన చేయడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళన చేస్తున్న మహిళలతో మాట్లాడి కులదూషణ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దళిత మహిళల ఫిర్యాదు మేరకు 20 మంది గౌడ కులస్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపారు.

Updated Date - May 20 , 2026 | 03:22 AM