చారిత్రక ఆలయం కూల్చివేతపై కేసు నమోదు
ABN , Publish Date - May 08 , 2026 | 06:34 AM
వరంగల్ జిల్లా ఖానాపుర్ మండలంలోని అశోక్‌నగర్‌లో ఉన్న 800 ఏళ్ల నాటి ప్రాచీన కాకతీయ శివాలయం కూల్చివేత ఘటనపై కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పురావస్తు విభాగం..
హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి): వరంగల్ జిల్లా ఖానాపుర్ మండలంలోని అశోక్‌నగర్‌లో ఉన్న 800 ఏళ్ల నాటి ప్రాచీన కాకతీయ శివాలయం కూల్చివేత ఘటనపై కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పురావస్తు విభాగం కేసు నమోదు చేసింది. తెలంగాణకు చెందిన హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఇచ్చిన ఫిర్యాదుతో నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడిని ‘‘మహారాజ’’, ‘‘రాజాధిరాజులు’’గా పేర్కొన్న క్రీ.శ 1231 నాటి అరుదైన శాసనాలు ఈ ప్రాంతంలో వెలుగులోకి వచ్చాయని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై వరంగల్ కలెక్టర్ సత్యశారదతో పాటు, ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ పురావస్తు శాఖ అధికారులపై విచారణ జరపాలని ఫిర్యాదుదారు కోరారు. ఇలాంటి చారిత్రక ఆలయాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం కూల్చివేయడం చరిత్రకారులు, స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయాన్ని కూల్చివేయకుండా ఉంటే సంరక్షణ, పునర్నిర్మాణం చేసే అవకాశం ఉండేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. 1965లోనే ఈ ఆలయ శాసనాలను హెరిటేజ్ శాఖ నమోదు చేసినట్లు సమాచారం.
శివాలయాన్ని పునర్నిర్మిస్తాం: వరంగల్ కలెక్టర్ సత్యశారద
శివాలయాన్ని పునర్నిర్మిస్తామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పురావస్తుశాఖ నోటిఫై చేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ‘ఈ ఆలయం కూల్చివేత ఘటనపై రెవెన్యూ, పురావస్తు శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ జరిపారు. ఆ ప్రదేశంలో దట్టమైన పొదలు ఉన్నాయి. వాటిని తొలగించే క్రమంలో శిథిలాలను గుర్తించారు. అంతేగానీ ఆలయాన్ని కూల్చివేయలేదు. ఆ స్థలం ప్రభుత్వానిదే. గతంలో గిరిజన సంక్షేమ శాఖకు దానిని కేటాయించారు’ అని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.