Land Registration Fraud: రిజిస్ట్రేషన్ కుంభకోణంలో 13మందిపై కేసు?
ABN , Publish Date - Jan 15 , 2026 | 06:11 AM
భూభారతి రిజిస్ట్రేషన్ చలానాల దారిమళ్లింపు కుంభకోణంపై విచారణ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. పోర్టల్‌లో లొసుగుల ఆధారంగా జనగామ జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా స్టాంపు డ్యూటీ జమ చేయడంలో అవకతవకలు జరగడం...
నేడు మీడియా ముందు ప్రవేశపెట్టే చాన్స్
దారిమళ్లించిన సొమ్మును తిరిగి.. చెల్లించే అవకాశమిచ్చిన సీసీఎల్‌ఏ
చెల్లింపునకు ససేమిరా అంటున్న రైతులు
తాము చెల్లిస్తామంటున్న మీసేవ బాధ్యులు
జనగామ, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): భూభారతి రిజిస్ట్రేషన్ చలానాల దారిమళ్లింపు కుంభకోణంపై విచారణ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. పోర్టల్‌లో లొసుగుల ఆధారంగా జనగామ జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా స్టాంపు డ్యూటీ జమ చేయడంలో అవకతవకలు జరగడం, దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం తెలిసిందే. జనగామ తహసీల్దార్ కార్యాలయంలో గత డిసెంబరు 24న జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన స్టాంప్ డ్యూటీ సొమ్ము ప్రభుత్వ ఖజానాకు జమ కాకపోవడాన్ని అధికారులు గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఈ నెల 7న జనగామ తహసీల్దార్ హుస్సేన్ జనగామ పోలీసులకు ఫిర్యాదు చేయగా 8న విషయం బహిర్గతమైంది. పోలీసులు జరిపిన విచారణలో ఈ తరహా అవకతవకలు రాష్ట్రవ్యాప్తంగా జరిగినట్లు తేలింది. దీనిని ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించగా.. సీసీఎల్‌ఏ, రెవెన్యూ, విజిలెన్స్, పోలీస్, ఇంటెలిజెన్స్ వర్గాలు విచారణ చేపట్టాయి. ఈ కుంభకోణంలో 13 మందిపై జనగామ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు చెందిన ప్రధాన సూత్రధారితోపాటు అదే జిల్లాకు చెందిన మరో 8 మంది, జనగామకు చెందిన ముగ్గురు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన ఒకరు ఉన్నట్లు సమాచారం. వీరిని గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి పక్కదారి పట్టిన చలానా సొమ్మును రికవరీ చేసేందుకు సీసీఎల్‌ఏ చర్యలు చేపట్టింది.
ప్రభుత్వానికి తక్కువగా జమ అయిన డాక్యుమెంట్లకు సంబంధించి ఇంకా చెల్లించాల్సిన చలానా సొమ్మును తిరిగి చెల్లించేందుకు అవకాశం కల్పించారు. సిటిజన్‌లో లాగిన్ అయిన తర్వాత అడిషనల్ పేమెంట్ మోడ్ ఆప్షన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆప్షన్ ద్వారా పెండింగ్‌లో ఉన్న చలానా మొత్తాన్ని చెల్లించేలా మార్పులు చేశారు. బాధ్యులైన రైతులు, మీసేవ నిర్వాహకులు ఎవరైనా.. అడిషనల్ పేమెంట్ మోడ్ ద్వారా మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని అధికారులు చెబుతున్నారు. అయితే దారి మళ్లిన సొమ్మును తాము ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించబోమని రైతులు అంటున్నారు. కాగా.. కుంభకోణంలో భాధ్యులైన మీసేవ, స్లాట్ బుకింగ్ సెంటర్ల నిర్వాహకులు కొంత మంది తాము దారి మళ్లించిన సొమ్మును తిరిగి రైతులకు ఇస్తామని ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.