గ్యాస్ట్రో ఇసోఫేజియల్ జంక్షన్ క్యాన్సర్ రోగికి ‘కేర్’లో శస్త్రచికిత్స
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:41 AM
అత్యంత ప్రమాదకరమైన ఇసోఫేజియల్ క్యాన్సర్ (ఆహారనాళ /అన్నవాహిక క్యాన్సర్)తో బాధపడుతున్న ఓ వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స చేసి హైదరాబాద్‌లోని...
ఆహారనాళాన్ని చిన్నపేగుతో కలిపి ఆహారం వెళ్లే మార్గం పునర్నిర్మాణం
కేర్ వైద్యుల అరుదైన రోబోటిక్ ఆపరేషన్
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): అత్యంత ప్రమాదకరమైన ఇసోఫేజియల్ క్యాన్సర్ (ఆహారనాళ /అన్నవాహిక క్యాన్సర్)తో బాధపడుతున్న ఓ వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స చేసి హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రి వైద్యులు ఉపశమనం కల్పించారు. గ్యాస్ట్రో ఇసోఫేజియల్ జంక్షన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తి శరీరంలో క్యాన్సర్ ప్రభావిత ప్రాంతాన్ని తొలగించడమే కాక, ఆహారం వెళ్లే మార్గాన్ని రోబోటిక్ శస్త్ర చికిత్స ద్వారా పునర్నిర్మించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేర్ ఆస్పత్రి వైద్యులు మంగళవారం వెల్లడించారు. హైదరాబాద్‌లోని చింతల్‌కు చెందిన రామారావు(53) నిరంతర దగ్గు, పైపొట్టలో స్వల్ప అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలతో కొంతకాలంగా బాధపడుతున్నారు. సాధారణ గ్యాస్ట్రిక్ సమస్య అనే భావనతో నిర్లక్ష్యం చేశారు. సమస్య తగ్గకపోవడంతో హైటెక్ సిటీలోని కేర్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించారు. కేర్ వైద్యులు చేయించిన పరీక్షల్లో రామారావు.. ఆహారనాళం, కడుపు కలిసే భాగంలో వచ్చే గ్యాస్ట్రో ఇసోఫేజియల్ జంక్షన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తేలింది. రామారావుకు హైపర్ టెన్షన్, మధుమేహం సమస్యలు కూడా ఉండగా.. ఆయనకు పూర్తి గ్యాస్ట్రెక్టమీ (కడుపు పూర్తిగా తొలగింపు) చేసి, జేజునోస్టమీ ద్వారా ఆహార మార్గాన్ని పునర్నిర్మించారు. కడుపులో క్యాన్సర్ ప్రభావిత భాగాన్ని తొలగించి, ఆహారం వెళ్లే మార్గాన్ని పునర్నిర్మించారు. ఆహారనాళాన్ని చిన్నపేగుతో కలిపి అవసరమైన చోట్ల ప్రేగులను అనుసంధానం చేశారు. రోబోటిక్ సిస్టమ్ సాయంతో సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ ఎన్. కరుణాకర్ రెడ్డి పర్యవేక్షణలో డాక్టర్ ముస్తఫా హుస్సేన్ రజ్వీ క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను నిర్వహించారు. రామారావును ఇప్పటికే డిశ్చార్జి చేశామని, వేగంగా కోలుకుంటున్నారని డాక్టర్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఆహారనాళ క్యాన్సర్లను గుర్తించడం కష్టమని, ఏమైనా లక్షణాలు కనిపిస్తే ప్రజలు వెంటనే వైద్యులను సంప్రదించాలని ఈ సందర్భంగా సూచించారు.