బైకును ఢీకొట్టి.. బాధితుడిని 2 కి.మీ ఈడ్చుకెళ్లి
ABN , Publish Date - May 03 , 2026 | 04:46 AM
కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడమే కాకుండా.. కారు ఆపడానికి యత్నించి బ్యానెట్‌పై పడిన బాధితుడిని ఓ కారు డ్రైవర్ దాదాపు రెండు కిలోమీటర్లు లాక్కెళ్లాడు.
హైదరాబాద్ మీర్‌పేట్‌లో కారు డ్రైవర్ బీభత్సం
కారుపై ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ అని స్టిక్కర్
సరూర్‌నగర్, మే 2 (ఆంధ్రజ్యోతి): కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడమే కాకుండా.. కారు ఆపడానికి యత్నించి బ్యానెట్‌పై పడిన బాధితుడిని ఓ కారు డ్రైవర్ దాదాపు రెండు కిలోమీటర్లు లాక్కెళ్లాడు. హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మీర్‌పేట్‌కు చెందిన ఎస్‌ఏ జిలానీ తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఎల్‌బీనగర్ వైపు వెళ్తుండగా గాయత్రీనగర్ యూటర్న్ వద్ద ఓ కారు వెనుక ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రీ కొడుకులకు గాయాలయ్యాయి. వెంటనే తేరుకున్న జిలానీకారును ఆపేందుకు ఎదురుగా వెళ్లగా డ్రైవర్ ఆపకపోవడంతో ఆయన కారు బ్యానెట్‌ను గట్టిగా పట్టుకున్నారు. అయినా డ్రైవర్ కారు ఆపకుండా బాధితుడిని అలాగే కిలోమీటర్ దూరంలోని బాలాపూర్ చౌరస్తా వరకు లాక్కెళ్లి, తిరిగి మంద మల్లమ్మ చౌరస్తాకు తీసుకువచ్చాడు. గమనించిన స్థానికులు కారుకు అడ్డగించగా.. బాధితుడు దిగగానే కారు డ్రైవర్ ఉడాయించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదానికి కారణమైన కారుపై ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ అని స్టిక్కర్ ఉండడం గమనార్హం! బాధితుడి ఫిర్యాదు మేరకు మీర్‌పేట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.