Car Accident: ఉరిమే ఉత్సాహం.. తరిమే విషాదమై!
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:31 AM
ఓ అమ్మాయి సహా ఐదుగురు విద్యార్థుల్లో పుట్టినరోజు వేడుక జరుపుకొన్న తాలూకు ఉత్సాహం.. అత్యుత్సాహమై కారును మరింత వేగంగా దూకించేలా చేసి ఘోర ప్రమాదానికి దారితీసింది.
చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు విద్యార్థుల దుర్మరణం
ఒక అమ్మాయికి తీవ్రగాయాలు.. ఆమె పరిస్థితి అత్యంత విషమం
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మీర్జాగూడ వద్ద ప్రమాదం
పుట్టినరోజు వేడుక జరుపుకొని ఇళ్లకు వెళుతుండగా దుర్ఘటన
శంకర్‌పల్లి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ఓ అమ్మాయి సహా ఐదుగురు విద్యార్థుల్లో పుట్టినరోజు వేడుక జరుపుకొన్న తాలూకు ఉత్సాహం.. అత్యుత్సాహమై కారును మరింత వేగంగా దూకించేలా చేసి ఘోర ప్రమాదానికి దారితీసింది. మితిమీరిన వేగంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయి రేకుల డబ్బా ముద్దలా మారిపోయింది. ఈ ఘటనలో ఆ వాహనంలోని నలుగురు యువకులు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. యువతి తీవ్రగాయాలతో బయటపడినా అమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మీర్జాగూడ గేటు వద్ద గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం దొంతాన్‌పల్లిలోని ఇక్ఫాయి కాలేజీలో బీబీఏ థర్డ్ ఇయర్ చదువుతున్న కూరగాయల సుమిత్ (20), నిఖిల్(20), బీబీఏ సెకండ్ ఇయర్ చదవుతున్న దేవల సూర్యతేజ (20), బీబీఏ చివరి సంవత్సరం విద్యార్థి సుంకరి నక్షత్ర, గండిపేటలోని ఎమ్‌జీఐటీ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న బల్మూరి రోహిత్(18) స్నేహితులు. బుఽధవారం సుమిత్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు సాయంత్రం నార్సింగిలో అంతా కలుసుకున్నారు. కాసేపు సరదాగా గడిపి రాత్రి నార్సింగిలోని ఓ హోటల్లో భోజనాలు చేశారు. అనంతరం ఎవరి ఇళ్లకు వారు వెళ్లే క్రమంలో సాయి అకా్‌షను మోకిలలోని అతడి ఇంటి వద్ద దిగటెట్టారు. తర్వాత మిగతా ఐదుగురు కారులో అర్ధరాత్రి ఒంటిగంటకు నార్సింగి వైపు బయలుదేరారు. సుమిత్ డ్రైవింగ్ సీట్లో కూర్చోగా, అతడి పక్కన నిఖిల్ కూర్చున్నాడు. సూర్యతేజ, రోహిత్, నక్షత్ర వెనుక సీట్లో కూర్చున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు మీర్జాగూడ గేటు వద్ద కారు అదుపు తప్పింది. గేటు వద్ద బారీకేడ్‌ను తప్పించే క్రమంలో చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమిత్, నిఖిల్, సూర్యతేజ, రోహిత్ అక్కడికక్కడే మృతి చెందారు. నక్షత్రకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులొచ్చి కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకి తీశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. నక్షత్రను చికిత్స నిమిత్తం నగరంలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదైంది.
ఒంటరైపోయిన తల్లి..
బర్త్ డే రోజే మృతిచెందిన సుమిత్ స్వస్థలం సంగారెడ్డి. ఇంట్లో ఏకైక కుమారుడు! సుమిత్ మృతితో తమకు దిక్కెవరు అంటూ తండ్రి వినయ్ భోరున విలపించాడు. నిఖిల్‌ది విజయవాడ. తండ్రి విజయ్ కరోనాతో చనిపోయాడు. తల్లి భాగ్యలక్ష్మి ఏకైక సంతనమైన నిఖిల్‌ను చూసుకొనే బతుకుతోంది. నార్సింగిలోని తన సోదరుని వద్ద ఉంటూ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. కుమారుడి మృతితో కంటికీమంటికి ధారగా రోదిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవ్వరివల్లా కావడం లేదు. కుమారుడి మృతితో ఆమె ఒంటరైపోయింది. సూర్యతేజది మంచిర్యాల జిల్లా. అతడు, తల్లిదండ్రులతో కలిసి తార్నాకలో ఉంటున్నాడు. ప్రయాణాలప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పే కుమారుడు, ఇలా ప్రమాదంలో దుర్మరణపాలయ్యాడని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు 5న తనకు కలొచ్చిందని, అదే ఇప్పుడు నిజమైందని తండ్రి అరుణ్ కుమార్ విలపించాడు. రోహిత్ కోకాపేటలో ఉంటున్నాడు. ఇద్దరు మగపిల్లల్లో రోహిత్ చిన్నవాడు. మృతుల తల్లిదండ్రులు, తోబుట్టువుల రోదనలతో చేవెళ్ల ప్రభుత్వాస్పత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.