Car Accident: కారు బోల్తా.. ఇద్దరు ఉపాధ్యాయురాళ్ల మృతి
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:34 AM
అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు మృతి చెందగా...
ఇద్దరికి తీవ్ర గాయాలు.. సూర్యాపేట జిల్లాలో ఘటన
అర్వపల్లి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు మృతి చెందగా, మరో ఇద్దరు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి శివారులో శనివారం ఉదయం జరిగింది. నల్లగొండకు చెందిన ప్రభుత్వోపాధ్యాయులు మామిడాల కల్పన(40), పోరెడ్డి గీతారెడ్డి (47), అల్వాల సునీతారాణి, అల్వాల ప్రవీణ్‌కుమార్ సూర్యాపేట జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. కల్పన తుంగతుర్తి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో ఎస్‌వోగా, గీతారెడ్డి, సునీతారాణి, ప్రవీణ్‌కుమార్‌లు రావులపల్లి, అన్నారం, తుంగతుర్తి జడ్పీ ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు గా విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా నల్లగొండలో నివాసం ఉంటూ రోజూ విధులకు కారులో వచ్చి వెళ్తుంటారు. ఈ క్రమంలో శనివారం కూడా పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కల్పన అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన గీతారెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన అన్నాచెల్లెళ్లు అల్వాల ప్రవీణ్‌కుమార్, అల్వాల సునీతారాణిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కారు డ్రైవర్ నదిపల్లి గిరికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని కల్పన భర్త లింగంపల్లి యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై సైదులు తెలిపారు.