kumaram bheem asifabad- కూర్చోలేక.. నిల్చోలేక..
ABN , Publish Date - Mar 13 , 2026 | 10:26 PM
జిల్లాలోని పలు మండలాల్లో బస్‌షెల్లర్టు లేక ప్రయాణికులు కూర్చోలేక, నిల్చోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్సుల కోసం చెట్ల నీడలో, హోటళ్ల ఎదుట, రోడ్డు పై వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రయాణికు ల సౌకర్యార్థం తాగునీరు, మూత్రశాలలు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో విద్యార్థినులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం కనీసం చేతి పంపులు సైతం ఎక్కడ లేవు.
- నిరీక్షణలో నిరసిస్తున్న ప్రయాణికులు
- ఎండా, వాన నుంచి రక్షణ కరువు
- పట్టించుకోని అధికారులు
ఆసిఫాబాద్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో బస్‌షెల్లర్టు లేక ప్రయాణికులు కూర్చోలేక, నిల్చోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్సుల కోసం చెట్ల నీడలో, హోటళ్ల ఎదుట, రోడ్డు పై వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రయాణికు ల సౌకర్యార్థం తాగునీరు, మూత్రశాలలు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో విద్యార్థినులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం కనీసం చేతి పంపులు సైతం ఎక్కడ లేవు. నిత్యం వివిధ పనులపై ప్రజలు ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. దీని కోసం బస్టాండుకుని చెరుకుని బస్సులు వచ్చే వరకు వేచి చూస్తారు. ఏదైనా కారణంతో బస్సులు ఆలస్యం అయినా వేచి ఉండేందుకు బస్టాండ్‌లు ఉండాలి. జిల్లాలో మూడు నాలుగు మండలాల్లో తప్ప ఆర్టీసీ బస్టాండ్‌లు ఎక్కడా లేవు. కొన్ని మండలాల్లో చెట్లు, కిరాణ షాపులు, దుకాణాలు, హోటళ్లు, రోడ్లపైనే వేచి చూడాల్సిన దయనీయ పరిస్థితి ఉంది. ఎండకాలం ఎండల తీవ్రత అధికం కావడంతో ప్ర యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు మూత్ర శాలలు, మరుగుదొడ్లు సైతం లేక పోవడంతో ఒకటికి రెంటికి ఉపిరి బిగపట్టి ఉండాల్సిన పరిస్థితి.
- రెండు చోట్ల మినహా..
జిల్లాలో తిర్యాణి, పెంచికలపేటలో బస్‌షెల్టర్‌లు తప్ప మరెక్కడా ప్రయాణికులు నిలచునేందుకు నిలువ నీడ లేదు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, కౌటా ల, వాంకిడిలలో బస్టాం డ్లు ఉన్నాయి. దీంట్లో వాంకిడి బస్టాండ్ నిరుపయోగంగా ఉంది. కెరమెరి, సిర్పూర్(యు), జైనూర్, దహెగాం, సిర్పూర్(టి), బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాల్లో బస్‌షెల్టర్లు లేక పోవడంతో వేసవి కాలంలో వేడిమి, వర్షాకాలంలో వర్షానికి, శీతకాలంలో చలికి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.. అందుబాటులో మంచినీటి సౌకర్యం, మూత్రశాలలు, మరుగుదొడ్ల వసతి కల్పించక పోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. 15 మండలాల్లో 2001 జనాభా లెక్కల ప్రకారం 5.15 లక్షల మంది ఉన్నారు.
- జిల్లాలో పరిస్థితి ఇలా..
వాంకిడి మండల కేంద్రంలో బస్టాండ్ ఉన్నప్పటికీ అది కొంత కాలంగా నిరుపయోగంగానే ఉంది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చి వేరే ప్రాంతానికి వెళ్లే వారు దుకాణాల దగ్గర, హోటళ్ల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి ఉది. ఈ సమయంలో మూత్రం వచ్చిన బహిర్భూమికి వెళ్లాలన్న ఇబ్బంది. జైనూర్ మండలంలో 31 వేల వరకు జనాభా ఉంది. ఇక్కడ అధిక శాతం గిరిజనులే. వీరు వివిధ గ్రామాల నుంచి పనుల నిమిత్తం మండల కేంద్రానికి ప్రతి రోజు వస్తుంటారు. బస్సులు ఆలస్యం కావడం వేచి చూసేందుకు బస్టాండ్ లేక పోవడంతో రోడ్డు పక్కన దుకాణాల వద్ద నిలబడి వేచి చూడాల్సిందే. దీనికి తోడు తాగునీటి వసతి, మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. అధిక శాతం గిరిజనులు ఉండే ఈ ప్రాంతం లో బస్టాండ్ ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. బెజ్జూరు, సిర్పూర్(టి), చింతలమానేపల్లి, దహెగాం, కెరమెరి మండలాల్లోనూ బస్టాండ్ లేక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి పరిస్థితులను బట్టి దుకాణాల వద్ద, చెట్ల నీడన, హోటళ్ల వద్ద బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎండ కాలం కావడంతో పైన ఎండ తీవ్రత, మంచినీటి వసతి లేక పోవడంతో వివిధ పనులపై మండల కేంద్రాలకు వచ్చే మహిళలు, చిన్న పిల్లలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అంతే కాక మూత్ర శాలలు, మరుగుదొడ్లు లేక పోవడంతో ప్రయాణికుల బాధలు రెట్టింపు అవుతున్నాయి. ఇకనైనా అధికారులు ప్రతీ మండల కేంద్రంలో బస్‌షెల్టర్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
బస్‌షెల్టర్‌లులేక ఇబ్బందులు.
- చిరంజీవి, సీపీఐ జిల్లా నాయకుడు
జిల్లాలో బస్‌స్టేజీల వద్ద బస్ షెల్టర్‌లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలంలో, ఎండాకాలంలో చెట్ల నీడ కింద బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తుంది. బస్‌స్టేజీల వద్ద మంచినీటి వసతి లేదు. దీంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. వాంకిడిలో బస్టాండ్ నిర్మించినప్పటికీ నిరుపయోగంగానే ఉంది. ఆర్టీసీ అధికారులు ప్రయాణికులు ఇబ్బందులు పడ కుండా బస్‌షెల్టర్‌లను ఏర్పాటు చేయాలి.