Share News

Nizamabad Central Jail: నిజామాబాద్‌ సెంట్రల్‌ జైలులో గంజాయి గుప్పు

ABN , Publish Date - Jan 01 , 2026 | 08:17 AM

అత్యంత కట్టుదిట్టమైన నిఘా ఉండే నిజామాబాద్‌ కేంద్ర కారాగారంలో గంజాయి గుప్పు మంది.

Nizamabad Central Jail: నిజామాబాద్‌ సెంట్రల్‌ జైలులో  గంజాయి గుప్పు

  • ఇద్దరు ఖైదీల్ని చితక్కొట్టిన జైలు అధికారులు.. తీవ్ర గాయాలు

  • ఖైదీల కారాగారాలు మార్పు... విచారణ చేపట్టిన జైళ్ల శాఖ

హైదరాబాద్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): అత్యంత కట్టుదిట్టమైన నిఘా ఉండే నిజామాబాద్‌ కేంద్ర కారాగారంలో గంజాయి గుప్పు మంది. జైలు గోడలు దాటి గంజాయి, సిగరెట్లు, ఇతర నిషేధిత పదార్ధాలు లోపల ఉన్న ఖైదీల చేతికి అందాయి. నిషేధిత పదార్ధాలు జైల్లోకి ఎలా వచ్చాయనేది విచారించాల్సిన జైలు అధికారులు.. వాటిని ఉపయోగించారన్న కారణంతో ఇద్దరు ఖైదీలను విచక్షణారహితంగా కొట్టారు. ఒకరికి పక్కటెముకలు, మరొకరికి కాలు విరగడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే జైలులో గత వారం ఇద్దరు ఖైదీలతో అధికారులు జైలు ఆవరణను పరిశుభ్రం చేయించారు. వారికి ఒక ప్యాకెట్‌ దొరకగా అందులో కొంత గంజాయి, సిగరెట్లు, ఇతర నిషేధిత పదార్ధాలు లభించాయి. గుట్టు చప్పుడు కాకుండా ఆ ఇద్దరు ఖైదీలు వాటిని ఉపయోగించారు. ఖైదీలు గంజాయి తాగారన్న విషయం రెండు రోజుల తర్వాత బయటకు రావడంతో జైలు అధికారులు వారిని విచక్షణారహితంగా కొట్టారు. ఓ ఖైదీకి పక్కటెముకలు, మరో ఖైదీకి కాలు విరిగింది. కేసు విచారణ సందర్భంగా ఇద్దరు ఖైదీలను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా తమపై జైలు అధికారులు చేసిన దాడి చేసిన విషయాన్ని, గాయాలను వారు న్యాయమూర్తికి విన్నవించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, తిరిగి అదే జైలుకు పంపితే అధికారులు ఇబ్బందిపెడతారని, ఆ జైలుకు వెళ్లబోమని ఖైదీలు వేడుకోవడంతో వారిని మరో జైలుకు తరలించారు. ఇంత జరిగినా జైలు అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా దాచడం మరో కొసమెరుపు. ఆలస్యంగా తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు.

Updated Date - Jan 01 , 2026 | 08:18 AM