Share News

జీవనశైలి మార్పులతోనే క్యాన్సర్‌

ABN , Publish Date - May 25 , 2026 | 04:47 AM

జీవనశైలిలో మార్పుల వల్లే రోజురోజుకూ క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోందని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ క్యాన్సర్‌ వైద్యుడు పాల్కొండ విజయ్‌...

జీవనశైలి మార్పులతోనే క్యాన్సర్‌

  • రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది

  • తొలి దశలోనే గుర్తిస్తే సులువుగా చికిత్స

  • శాకాహారం, క్రమం తప్పని వ్యాయామంతో మహమ్మారిని అడ్డుకోవచ్చు

  • ‘ఆంధ్రజ్యోతి’తో డాక్టర్‌ విజయ్‌ ఆనంద్‌రెడ్డి

న్యూఢిల్లీ, మే 24 (ఆంధ్రజ్యోతి): జీవనశైలిలో మార్పుల వల్లే రోజురోజుకూ క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోందని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ క్యాన్సర్‌ వైద్యుడు పాల్కొండ విజయ్‌ ఆనంద్‌ రెడ్డి అన్నారు. గతంలో గ్రామాల్లో ఉన్న వారికి అంటువ్యాధుల మూలంగా క్యాన్సర్‌ వచ్చేదని, ఇప్పుడు పట్టణాల్లో ఉన్న వారికి జీవనశైలి మార్పుల మూలంగా క్యాన్సర్‌ అధికంగా విస్తరిస్తోందని చెప్పారు. ఇప్పటివరకు 75 వేల మందికి క్యాన్సర్‌ చికిత్స అందించానని, వారిలో 85 శాతం ఆ వ్యాధి నుంచి కోలుకున్నారని తెలిపారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ఆయన.. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును స్వీకరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ప్రస్తుతం అపోలో క్యాన్సర్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న విజయ్‌ ఆనంద్‌రెడ్డి.. తాను స్థాపించిన క్యూర్‌ ఫౌండేషన్‌ ద్వారా 14 ఏళ్ల లోపు పిల్లలకు క్యాన్సర్‌ వ్యాధికి ఉచిత చికిత్సను అందిస్తున్నారు. ‘ఐ యామ్‌ ఏ సర్వైవర్‌’ పేరిట ఆయన రాసిన పుస్తకం కూడా ప్రాచుర్యం పొందింది. క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సులువుగా నివారించవచ్చని, మూడో దశకు చేరితే కీమో థెరపీ తప్పదని చెప్పారు. మానసిక ఒత్తిడి, ఊబకాయం, ధూమపానం వల్ల క్యాన్సర్‌ అధికంగా వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. శాకాహారులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో క్యాన్సర్‌ వ్యాప్తి తక్కువని తేలిందన్నారు. మసాలా పదార్థాలు, బయటి తిళ్లు, మాంసాహారం వల్ల క్యాన్సర్‌ వ్యాప్తి జరుగుతోందని వెల్లడించారు. మహిళల్లో ఆలస్యంగా వివాహాలు, లేటుగా పిల్లల్ని కనడం, అలాగే యవ్వనంగా కనిపించాలనే ఉద్దేశంతో హార్మోన్ల మాత్రల వాడకంతో మెనోపాజ్‌ను ఆలస్యం చేసుకోవడం వల్ల క్యాన్సర్‌ ముప్పు పెరుగుతోందన్నారు. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన, చైతన్యం తెచ్చేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టానని చెప్పారు.

Updated Date - May 25 , 2026 | 04:47 AM